ఇందల్వాయి/భిక్కనూరు/రామారెడ్డి, నవంబర్ 9: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే శనివారం ప్రారంభమైంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేశారు. అయితే, వివరాల సేకరణకు వెళ్లిన సిబ్బందికి ప్రజల నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురయ్యాయి. సర్వే ఎందుకు చేస్తున్నారు..? వివరాలు తీసుకుని ఏం చేస్తారు? స్థిరాస్తుల వివరాలు చెబితే ప్రభుత్వ పథకాలు అందకుండా పోతాయా? వంటి అనేక సందేహాలను లేవనెత్తారు. ఎన్యుమరేటర్లు వారికి సర్దిచెప్పి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు.
సర్వే ప్రారంభమైన నేపథ్యంలో ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి శరత్ రెండు జిల్లాల్లో పర్యటించి వివరాల సేకరణను పరిశీలించారు. ఇందల్వాయి, భిక్కనూరు మండలాల్లో పర్యటించిన ఆయన సిబ్బందితో పాటు గ్రామస్తులతో మాట్లాడారు. సమగ్ర సర్వేలో పక్కా సమాచారం సేకరించాలని సిబ్బందికి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడానికి దోహదపడుతుందన్నారు. సర్వేకు ప్రజలు సహకరించాలని సూచించారు. మరోవైపు, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ రామారెడ్డిలో పర్యటించి సర్వే కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా వివరాలు నమోదు చేయాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను ఆదేశించారు.