కామారెడ్డి, ఫిబ్రవరి 9: కామారెడ్డి మున్సిపల్లో కమిషనర్ల బదిలీ పర్వం కొనసాగుతున్నది. తరచూ కమిషనర్ల బదిలీల వ్యవహారం పట్టణవాసులను విస్మయానికి గురిచేస్తున్నది. ఇటీవల తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో కమిషనర్లు మారారు. పూటకొకరు బదిలీ మాదిరిగా ఏడాదిలో ఏడుగురు కమిషనర్లు బదిలీ కావడం గమనార్హం. పాలకవర్గం ఉన్నప్పుడు కమిషనర్లు తరచూ మారడంపై వివాదం చెలరేగింది. ఇప్పుడు పాలకవర్గం రద్దయినప్పటికీ నెల రోజుల వ్యవధిలోనే కమిషనర్లు మారడం చర్చనీయాంశంగా మారింది. ఈ బదిలీలపై అధికార పార్టీల నేతల ‘హస్తం’ ఉందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
కమిషనర్‌గా ఎవరు వస్తారో, ఎన్నిరోజులు ఉంటారో తెలియక మున్సిపల్ సిబ్బందితోపాటు పట్టణవాసులు గందరగోళానికి గురవుతున్నారు. కొత్తగా వచ్చిన కమిషన్లు ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కమిషనర్లు ఎక్కువకాలంలో పనిచేసిన రోజులు ఉన్నాయి. పదేండ్ల కాలంలో కేవలం ఐదుగురు మున్సిపల్ కమిషనర్లు మాత్రమే బదిలీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కామారెడ్డి మున్సిపల్లో ఏడాది కాలంలోనే ఏడుగురు కమిషన్లు బదిలీ కావడం గమనార్హం.
గతంలో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఉన్నారంటే సిబ్బంది, ప్రజల్లో ఒక భద్రతా భావం ఉండేది. కానీ ఇప్పుడు పూటకొక మున్సిపల్ కమిషనర్ మారుతూ ఉంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. పాలకవర్గ పదవీకాలం ముగియడంతో మున్సిపల్లో పాలన అదుపుతప్పింది. పట్టణంలో కూడా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇలాగే బదిలీల పర్వం కొనసాగితే పట్టణం పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్నదని, అభివృద్ధి పనులు కూడా జరిగే అవకాశాలు ఉండవని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
కామారెడ్డి మున్సిపల్లో ఈ ఏడాదిలో ఏడుగురు కమిషనర్లు బదిలీ అయ్యారు. 2020 మే 18 వరకు మున్సిపల్ కమిషనర్‌గా దేవేందర్ పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు కొనసాగారు. 2024 ఫిబ్రవరి 13న దేవేందర్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో సుజాత అదే సంవత్సరం మే 15న బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 31న బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో గిరిధర్ ఇన్చార్జి కమిషనర్‌గా నవంబర్ 1 నుంచి 5 వరకు ఐదు రోజులు మాత్రమే బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో వేణుగోపాల్ నవంబర్ 6 నుంచి 25 వ తేదీ వరకు 19 రోజులు మాత్రమే మున్సిపల్ కమిషనర్ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించారు.
తరువాత ఎల్లారెడ్డి ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్న శ్రీహరిరాజ్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 18వరకు ఇన్చార్జి కమిషనర్‌గా వ్యవహరించారు. 2024 డిసెంబర్ 19 నుంచి 2025 ఫిబ్రవరి 3 వరకు స్పందన్ మున్సిపల్ కమిషనర్‌గా నెల పది రోజుల పాటు పనిచేశారు. ఇప్పుడు ఆమె స్థానంలో రాజేందర్ రెడ్డి ఈ నెల 3న మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషనర్ కూడా పూర్తిగా విధులు నిర్వర్తిస్తారా లేదా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల బదిలీపై వెళ్లారా అని పలువురు చర్చించుకుంటున్నారు.