కామారెడ్డి/ ఖలీల్వాడి, జూలై 1 : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేద, మధ్య తరగతి విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులపై కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. అటు కళాశాల అధ్యాపకులు, సిబ్బందికి వేతనాలు చెల్లించడంలో యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో మూడు బడ్జెలు ప్రవేశపెట్టింది. ఒక్క బడ్జెట్లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు కేటాయించలేదు. అంతేగాకుండా ఈ పథకాన్ని రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. విద్యార్థుల జీవితాలో ప్రభుత్వం ఆటలాడుకుంటున్నది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఫీజులను కళాశాలలు విద్యార్థుల వద్ద వసూలు చేసుకోవాలని తీర్పు ఇచ్చింది. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేస్తే తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని విద్యార్థులు భావిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.7 వేల కోట్ల బకాయిలు
రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 7వేల కోట్లవరకు ఉన్నాయి. వీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బకాయిలపై ప్రభు త్వం నుంచి స్పష్టమైన హామీ కూడా లేకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, ఇంటర్ అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని కోర్టు తీర్పులు వస్తుంటే, ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
తల్లిదండ్రులపై ఒత్తిడి
కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక ఒక్కసారికూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించిన దాఖలాలు లేవు. దీంతో కొన్ని ప్రైవేట్ కళాశాలలు మూసుకునే పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో అప్పులు తీసుకొని కళాశాలలను నడిపిస్తున్నట్లు కొందరు కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని కళాశాలలు ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు ఎలా చదువుతారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
నేడు కళాశాలల బంద్
ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితంలేదని భావించిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు.. బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు కళాశాలల బంద్కు పిలుపునిచ్చాయి.
కళాశాలల బంద్కు సహకరించాలి..
కళాశాలల బంద్ పాటించి బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలి. శాంతియుతంగా బంద్ పాటించి, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. విద్యార్థుల భవిష్కత్తుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
-నరాల సుధాకర్, ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ బాధ్యులు
విద్యార్థులను ఆదుకోవాలి..
ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభు త్వం వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలి. సిబ్బందికి సరిగా జీతా లు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలి.
-జైపాల్ రెడ్డి, ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ బాధ్యులు