నిజామాబాద్ స్పోర్ట్స్, జనవరి 9: రైతుల నుంచి ప్రభుత్వపరంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ చేపట్టి నెలాఖరులోగా నిర్దేశిత కోటాకనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలను భారత ఆహార సంస్థకు చేరవేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు రైస్‌మిల్లర్లకు సూచించారు. ప్రతి రైస్‌మిల్లులో పూర్తి సామర్థ్యానికనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ జరగాల్సిందేనని స్పష్టంచేశారు. నిర్లక్ష్యం వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే రైస్మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. సీఎంఆర్ లక్ష్య సాధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం తన చాంబర్లో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్ తదితరులతో కలిసి రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. నిర్ణీత లక్ష్యం మేరకు మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను అందించకపోవడంపై కలెక్టర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఆర్ కేటాయింపుల్లో జాప్యా న్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నందున ఇకపై మిల్లర్ల అలసత్వాన్ని తాము ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.
జిల్లాలోని రైస్‌మిల్లులో రోజూ కనీసం 6వేల మెట్రిక్ టన్నుల మేర కస్టమ్ మిల్లింగ్ జరిపే సామర్థ్యమున్నప్పటికీ సగటున కేవ లం 2వేల మెట్రిక్ టన్నుల వరకే మిల్లింగ్ జరుగుతున్నదని అసంతృప్తి వెలిబుచ్చారు. దాదాపు 35 వరకు మిల్లులు ఇంతవరకు సీఎంఆర్ కేటాయింపులనే ప్రారంభించలేదని ఆక్షేపిస్తూ, నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టమైన హెచ్చరికలు చేశారు. తాము ఎలాంటి సాకు లు వినదల్చుకోలేదని అవసరమైతే ధాన్యా న్ని కొనుగోలు చేసి అయినా నిర్ణీత గడువులోపు లక్ష్యానికనుగుణంగా సీఎంఆర్ డెలివరీ చేయాలని మిల్లర్లకు తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే జిల్లా యంత్రాంగం తరఫున తప్పనిసరిగా వాటి ని పరిష్కరిస్తామన్నారు. కాగా ఇప్పటికే 2022-23 వానకాలం, యాసంగి సీఎంఆర్ లక్ష్య సాధనకు చేరువలో ఉ న్న రైస్‌మిల్లులో 2023 -24 వానకాలానికి సం బంధించి కూడా కస్టమ్ మిల్లింగ్ నిర్వహించేలా అనుమతించాలని పలువురు రైస్‌మిల్లర్లు కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. సమావేశంలో డీఎస్వో చంద్రప్రకాశ్, సివిల్ సప్లయీస్ డీఎం జగదీశ్, ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్ వర్మ, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వి.మోహన్‌రెడ్డి, శ్రావణ్ పాల్గొన్నారు.