దోమకొండ/బీబీపేట, మే 16: అకాల వర్షాల కారణంగా ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తూకం వేసి సిద్ధంగా ఉన్న ధాన్యపు బస్తాలను వెంటనే తరలించాలని, అందుకు అవసరమైన లారీలను కేంద్రాలకు పంపాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలున్నాయా అని నిర్వాహుకులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. మిల్లర్లు కూడా 24 గంటల్లోగా ధాన్యం దించుకునేలా పర్యవేక్షించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేయాలన్నారు.
అకాల వర్షాలతో ధాన్యం కాస్త చెడిపోయినా రైతుల పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి కోత విధించకుండా అన్లోడ్ చేసుకొని ట్రక్ షీట్ జారీ చేయాలన్నారు. తహసీల్దార్లు, గిర్దావర్లు, సూపర్వైజర్లతోపాటు అధికారులు దగ్గరుండి కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 44,182 మంది రైతుల నుంచి రూ. 541కోట్ల విలువ గల 2 లక్షల 46 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.474 కోట్లు చెల్లించామని, ట్యాబ్ ఎంట్రీ కూడా 96 శాతం మేర పూర్తి చేశామని, త్వరలో మిగతా రైతుల ఖాతాలో డబ్బులు జమచేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా ఇన్చార్జి మేనేజర్ నిత్యానందం, అధికారులు ఉన్నారు.