మాట తప్పడం.. మడమ తిప్పడం కాంగ్రెస్ నైజంగా మారి పోయింది. ఓట్ల కోసం హామీలు గుప్పించడం, ఆ తర్వాత ఎగవేయడం హస్తం పార్టీకి పరిపాటిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టారు. మళ్లీ లోక్‌సభ ఎలక్షన్ల ముందర అలాగే వరాలు కురిపించి, ఎన్నికలవ్వగానే ఓటర్లకు ‘చేయి’చ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా పోయింది. సెప్టెంబర్ 17లోపు నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ఇందూరు గడ్డపై సీఎం చేసిన ప్రకటన ఉత్త మాటగానే మిగిలి పోయింది.
నిజామాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి తేటతెల్లమైంది. రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధర హామీల్లాగే.. నిజాం షుగర్స్ పునరుద్ధరణ విషయంలోనూ అధికార పార్టీ అన్నదాతలకు మరోసారి రిక్త‘హస్తమే’ చూపింది. సెప్టెంబర్ 17లోగా ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ఏకంగా సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనకే దిక్కు లేకుండా పోయింది. ఓట్ల కోసం, సీట్ల కోసం రైతులు, ప్రజలను కాంగ్రెస్ ఏవిధంగా మభ్యపెడుతుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదంతం చాలు.
సీఎం గారు.. పునరుద్ధరణ ఏమైంది?
అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికల వేళా నిజాం షుగర్స్ పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ గొప్పలకు పోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన హస్తం పార్టీ.. ఆ దిశగా పెద్దగా చర్యలు చేపట్టలేదు. అయితే, లోక్‌సభ ఎన్నికలు రావడంతో హడావుడిగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఎలక్షన్లకు ముందు ఆ కమిటీ ఒకసారి మాత్రమే ఫ్యాక్టరీని సందర్శించి, రైతులతో మాట్లాడి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 8న నిజామాబాద్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 17లోగా ఫ్యాక్టరీని తెరిపిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రేవంత్ ప్రకటించిన గడువు ముగిసి పది రోజులై పోయింది. అయినా సీఎం మాట అమలు కాలేదు. ఫ్యాక్టరీ తెరుచుకోలేదు.
ఎన్నికల వేళ హామీలు గుప్పించడం, తర్వాత గాలికొదిలేయడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాలపై వరాల జల్లును కురిపించింది. రూ.2లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పంటలకు మద్దతుధర, వడ్లకు రూ.500 బోనస్ వంటి హామీలతో రైతులను మభ్యపెట్టింది. అధికారంలోకి రాగానే కొందరికే రుణమాఫీ చేసి మిగతా వారికి ఎగనామం పెట్టింది. వానకాలం ఆరంభంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టింది. బోనస్ సన్నవడ్లకే వర్తింపు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న సర్కారు.. మద్దతు ధర విషయంలో మాట కూడా మాట్లాడట్లేదు.
మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తదితరులు.. రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలను ఈ ఏడాది ఫిబ్రవరి 24న తెలుసుకున్నారు. చెరుకు రైతులకు పర్చేస్ ట్యాక్స్, రాయితీని పరిశీలిస్తామన్నారు. అయితే, ప్రైవేట్ యాజమాన్యం బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పుల విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు. మరోవైపు, ఫ్యాక్టరీ పునరుద్ధరణ, చెరుకు సాగు వైపు రైతులను మళ్లించడం, శిథిలావస్థకు చేరిన యంత్రాలకు మరమ్మతులు, కార్మికుల బకాయిల విషయంలో ఏమాత్రం స్పష్టత ఇవ్వలేదు. పునరుద్ధరణ అంటే ప్రభుత్వమే మొత్తం ఫ్యాక్టరీని చేతుల్లోకి తీసుకుని నడుపుతుందా? లేదంటే ఇప్పుడున్న యాజమాన్యానికే బాధ్యతలు ఇస్తుందా? అన్నది జవాబు లేని ప్రశ్నగా మారింది. శ్రీధర్ బాబు నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా యాజమాన్యాన్ని మార్చేసి కొత్త వారికి ఫ్యాక్టరీని కట్టబెడతారా? అన్నది తేలాల్సి ఉంది.
2015 డిసెంబర్లో ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం అకస్మాత్తుగా లేఆఫ్ ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కార్మికులకు వేతనాలు రావాలి. ఈ వేతన బకాయిలు, నిజాం షుగర్స్ పునరుద్ధరణకు సంబంధించి వినతిపత్రం ఇద్దామని ప్రభుత్వంలోని పెద్దలను కలిసేందుకు కార్మికులు ప్రయత్నిస్తుంటే, కలువకుండా ముఖం చాటేస్తున్నారు.
2024-25 అసెంబ్లీ బడ్జెట్లో నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తన ప్రసంగంలో చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరుతో ఈ ఆర్థిక సంవత్సరం సగం పూర్తవుతున్నా ఆ దిశగా అడుగులే పడడం లేదు. జాయింట్ వెంచర్లో ఉన్న ఈ ఫ్యాక్టరీని ముందు ప్రైవేట్ యాజమాన్యం పెత్తనం నుంచి విడిపించాలి. ఇందుకు ఏం చేస్తారో మాత్రం చెప్పలేదు. ఇక, పునరుద్ధరణపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కూడిన కమిటీ ఫ్యాక్టరీ భవితవ్యంపై ఏ నిర్ణయం తీసుకుందన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది.