కామారెడ్డి, సెప్టెంబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఇందులో భాగంగానే మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మాటను నిలబెట్టుకొని కామారెడ్డికి మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతో పాటు ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేశారు. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల మంజూరై వడివడిగా పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహించారు. మెడికల్ కళాశాలలో ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభం కానుండడంతో కామారెడ్డి ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరబో తున్నది. దీంతో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.
కొనసాగుతున్న కౌన్సెలింగ్
కామారెడ్డి జిల్లా ఏర్పడడంతో అనేక రకాల వసతులతో కూడిన సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దేవునిపల్లి డిగ్రీ కళాశాల వెనుక ఎంసీహెచ్ భవనంలో మరో 100 పడకలతో మాతా శిశు దవాఖానతో పాటు ఇతర విభాగాలను ఏర్పాటు చేశారు. నూతన మెడికల్ కళాశాల పనులు పూర్తయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేశారు.100 సీట్లలో ఆలిండియా కోటాలో 15 సీట్లకు గాను 10, రాష్ట్ర కోటాలో 85 సీట్లకు 85 భర్తీ అయ్యాయి.
75 మంది సిబ్బంది నియామకం
కామారెడ్డి మెడికల్ కళాశాలలో 10 మంది ప్రొఫెసర్లు అందులో ఏడుగురు రెగ్యులర్, రెండు కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారం, ఒకరు ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. వీరితో పాటు 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇందులో 25 మంది రెగ్యులర్, ఇద్దరు కాంట్రాక్ట్, ఐదుగురు సీనియర్ రెసిడెంట్, ఐదుగురు హౌస్ సర్జన్లను నియమించారు. త్వరలో మరో 20 మంది సీనియర్ రెసిడెంట్లు రానున్నారు. ఇప్పటికే ప్రిన్సిపాల్, 26 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్లు, ఐదుగురు సూపరింటెండెంట్లు విధుల్లో చేరారు. త్వరలో మరికొందరు విధుల్లో చేరనున్నారు. ఈ మెడికల్ కళాశాలలో అనాటమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, రేడియో డయాగ్నోస్టిక్‌కు ఒక్కొక్కటి చొప్పున, జనరల్ సర్జరీకి నాలుగు, ఆర్థోపెడిక్స్‌కు రెండు, ఈఎన్టీకి ఒకటి, ఓబీజీకి మూడు, అనస్తీషియాకు మూడు పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ నెల 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 9 మెడికల్ కాలేజీలను హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ద్వారా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో కామారెడ్డి మెడికల్ కళాశాల పనులన్నీ చకచకా పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది.
హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
ఉత్తర తెలంగాణ మూడు జిల్లాలకు ముఖ్య కూడలిగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రాల్లో కామారెడ్డి ఒకటిగా ఉంది. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, విద్యారంగ అభివృద్ధితో కామారెడ్డి కేంద్రం విరాజిల్లుతున్నది. కొత్త జిల్లా ఏర్పాటుతో మరింత పురోగతి సాధిస్తున్నది. గత ఎన్నికల సమయంలో గంప గోవర్ధన్‌ను ఎమ్మె ల్యేగా గెలిపిస్తే కామారెడ్డి జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ మేరకు మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం జిల్లా ఏర్పాటుతో పాటు సమీకృత కలెక్టరేట్, పోలీసు భవనాలు నిర్మించి ప్రారంభించారు. ప్రజల అభీష్టం, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరిక మేరకు కామారెడ్డి జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తానన్న మాటకు కట్టుబడిన సీఎం కేసీఅర్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో వైద్య సేవలు మరింత పెరుగుతాయని కామారెడ్డి ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
ఈ నెల 15 నుంచి మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నీట్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగింది. మొత్తం 100 సీట్లకుగాను ఆలిండియా కోటలో 15 సీట్లకు 10 సీట్లు, రాష్ట్ర కోటాలో 85 సీట్లకు గాను 75 సీట్లు భర్తీ అయ్యాయి. త్వరలో మిగిలిన సీట్లను భర్తీ చేస్తాం.
– డాక్టర్ పి.వెంకటేశ్వర్, ప్రిన్సిపాల్, కామారెడ్డి మెడికల్ కాలేజీ