ఉద్యమ వారధి, సంక్షేమ సారథి సీఎం కేసీఆర్ నేడు, రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వేల్పూర్, ఆర్మూర్‌లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గురువారం వేల్పూర్ ఎక్స్ రోడ్లో నిర్వహించనున్న కేసీఆర్ సభకు మంత్రి వేముల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా జనం స్వచ్ఛందంగా తరలిరానున్న ఈ కార్యక్రమం కోసం గ్యాలరీలు, వేదిక సహా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో వేల్పూర్‌కు రానున్న సీఎం.. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన పనులు, మరోసారి అధికారంలోకి వస్తే చేయబోయే పనులను వివరించనున్నారు.
కమ్మర్పల్లి/వేల్పూర్, నవంబర్ 1:బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల పర్యటనలో భాగంగా ఆయన నేడు వేల్పూర్‌కు రానున్నారు. మంత్రి వేముల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ప్రశాంత్‌రెడ్డిని మరోమారు ఆశీర్వదించాలని, బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరనున్నారు. కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మంత్రి వేముల భారీ ఏర్పాట్లు చేశారు. వేల్పూర్ ఎక్స్‌రోడ్‌లోని స్పైసెస్ పార్కు ఆవరణలో ఈ సభను నిర్వహించనున్నారు. భారీగా జన సమీకరణ చేసే పనుల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నిమగ్నమయ్యారు. 55 వేల మందికిపైగా తరలిరానున్న ఈ సభకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికతో పాటు చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని గులాబీ తోరణాలతో అలంకరించారు. పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి సభ ఏర్పాట్లను మంత్రి వేముల బుధవారం పరిశీలించారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపే సభకు చేరుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
భీమ్‌గల్ కర్షకుల సంఘం మంత్రి వేములకు సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు మద్దతు తీర్మానంతో పాటు ఎన్నికల ఖర్చు కోసం మంత్రి వేములకు రూ.50 వేలు అందజేశారు. వారి అభిమానానికి ముగ్ధుడైన ప్రశాంత్‌రెడ్డి.. సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఉద్యమ కాలం నుంచే బాల్కొండ బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేసిన వేముల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మూడోసారి బరిలో నిలిచిన ఆయన ప్రతిపక్షాలకు అందనంత వేగంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సంక్షేమ పథకాలు పొందిన లక్షలాది మంది స్వచ్ఛందంగా వేల్పూర్‌కు తరలిరానున్నారు. మరోవైపు, కేసీఆర్ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. స్వచ్ఛందంగా తరలిరానున్న ప్రజల కోసం రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు.