తెలంగాణలో హామీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. కేరళంలో మాత్రం లేని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నది. మలయాళ దినపత్రికలో భారీ స్థాయిలో ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకుంటున్నది. ఫిబ్రవరి 28, మార్చి 3న అత్యధిక సర్క్యులేషన్ ఉన్న మలయాళ దినపత్రిక ‘మలయాళ మనోరమ’లో రెండేసి పేజీలున్న జాకెట్ యాడ్స్‌ను మొదటి దఫాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తమ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేని విషయాలపై కాంగ్రెస్ ప్రాపగాండా ఎందుకు? అని కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు.
తెలంగాణలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి నుంచి తీవ్ర నిరసనను, ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నది. ఎన్నికలకు ముందు ‘ఇందిరమ్మ ఇండ్లు’ పేరుతో పేదలందరికీ గృహాలు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసిన హస్తం పార్టీ ఇప్పటివరకు ఎక్కడా కూడా ఇండ్లను పూర్తి చేయలేదు. కొత్త ఇండ్లు కట్టడం సంగతి పక్కనబెడితే ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో వందలాది పేదల ఇండ్లను నేలమట్టం చేసింది. భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకున్నారనే సాకుతో పేదలను రోడ్డున పడేసింది. తెలంగాణలో అమలు చేయని వాగ్దానాలు, సాధించని ప్రగతి, సంక్షేమం గురించి కేరళంలో చేస్తామంటూ అక్కడి పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చుకుంటున్నది. మరోవైపు వెలుగుమట్ల బీభత్సాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమాల వేదికగా ఖండించారు.
తెలంగాణలో లేని అభివృద్ధిపై, విజయాల గురించి మలయాళ పత్రికలో రేవంత్ సర్కార్ ఇంతగా ప్రచారం చేసుకోవడానికి కారణాలు లేకపోలేదు. కేరళం 16వ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్మే మాసాల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పెద్దలు అక్కడ వింత విన్యాసాలకు తెరతీశారు. కేరళంలో వరుసగా 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. పదేండ్ల తర్వాతైనా ఆ రాష్ట్రంలో గెలువాలనే ఆరాటంతో ఉన్నది. దీనికి తోడు కేరళంలోని వాయనాడ్ నుంచి మొదట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన చెల్లెలు ప్రియాంకాగాంధీ వాడ్రా ఎంపీగా ఉన్నారు. ఎలాగైనా కేరళంలో అధికారం కైవసం చేసుకోవాలనే ఆ, ఆరాటం కాంగ్రెస్‌లో కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకోవడమే రేవంత్‌రెడ్డికి ముఖ్యమైన ఎజెండా అయిపోయింది. పాలన గురించి పట్టించుకోకుండా, ప్రజల మనోభావాలను గుర్తించకుండా రోజుకో డైవర్షన్ రాజకీయ నాటకాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. తాను నిర్వహిస్తున్న శాఖల పనితీరు కూడా అధ్వానంగా ఉన్నదని తానే చెప్పుకొంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక భజనతో కాలం వెళ్లదీస్తున్నారు. కేరళంలో హస్తం పార్టీ గెలుపు కోసం తాను కూడా కష్టపడుతున్నట్టు చెప్పుకోవడానికి తాపత్రయ పడుతున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రెండోసారి వాయనాడ్ నుంచి పార్లమెంటుకు పోటీచేయడానికి నామినేషన్ వేసినప్పుడు రేవంత్ స్వయంగా అక్కడకు పోయి హాజరు వేయించుకున్నారు. కొన్ని మాసాల తర్వాత అక్కడ జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఆయన వాయనాడ్‌లో నెహ్రూగాంధీ కుటుంబ పెద్దల ముందు కనిపించి తన విధేయత చాటుకున్నారు. అంతకు కొన్ని నెలల ముందు కేరళం సీఎం విజయన్‌పై విమర్శనాస్ర్తాలు సంధించారు.
మలయాళ మనోరమలో ఇచ్చిన ఒక జాకెట్ యాడ్‌లో ‘తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తున్నది.’ అనే శీర్షికతో పెద్ద అవాస్తవాన్ని కేరళం జనం ముందు ఉంచింది రేవంత్ ప్రభుత్వం. ఇంకా ఇదే పేజీలో ‘ప్రజల ప్రాణాలు, ఉపాధులను కాపాడడమే మా లక్ష్యం’ అనే మాటలతోపాటు తమ పాలనలో 20 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చామని మరో పెద్ద అబద్ధానికి అక్షర రూపం ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. దేశంలోనే అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉండడమేగాక, తీవ్ర పేదరికాన్ని శరవేగంతో నిర్మూలించిన కేరళం ప్రజలనే బురిడీ కొట్టించడానికి రేవంత్ సర్కార్ దుస్సాహసం చేసింది. ఈ ప్రయత్నాలు విఫలంగాక తప్పదు. ఎందుకంటే అసలు వాస్తవాలు ఈ ప్రకటనల్లో చెప్పిన మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. రెండేండ్లలోనే 20 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటనల్లో చెప్తే నమ్మేంత అమాయకులు కాదు మలయాళీలు. ఇదే పత్రికలో ప్రచురితమైన మరో పేజీ ప్రకటనలో మరో అసత్యానికి భారీ ప్రచారం కల్పించారు. ‘కోటి మంది మహిళలు కోటీశ్వరులు కాబోతున్నారు’ అనే శీర్షికతో వాస్తవ విరుద్ధమైన విషయాలు వివరించారు. ‘లక్ష కోట్ల రూపాయల బ్యాంకు పరపతికి ఏర్పాట్లు, వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణాలు, ఇప్పటి వరకూ 280 మహిళా బృందాలకు ప్రయోజనం, మహిళా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, స్వయంసహాయక బృందాలకు సర్కారు మద్దతు’ అంటూ అడ్డగోలు ప్రచారానికి అక్షరరూపం కల్పించారు. రెండేండ్లుగా తెలంగాణలో ప్రజా సంక్షేమం, ప్రగతిలో రాష్ట్ర ప్రభుత్వం పతనావస్థలో ఉన్నది. జనం అవసరాలు తీర్చే కార్యక్రమాలకు నిధుల ప్రవాహం గణనీయంగా తగ్గించేశారు. రోడ్లు, పారిశుధ్యం వంటి నిరంతర ప్రజల సౌకర్యాలను రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రచారంలో మాత్రం జనం నవ్వుకునేలా చేస్తున్నారు.
కొన్ని నెలలుగా తెలంగాణ ఆర్థిక బాధలు, తన చేతకానితనానికి కారణాలు వివరిస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ‘ఢిల్లీ పోతే తెలంగాణ సర్కారు వారికి తగిన గౌరవం, గుర్తింపు లేదు.
రుణాలు అడుగుతామనే భయంతో బ్యాంకులు పారిపోతున్నాయి’ అనే తీరున ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడారు. అలాగే, నగరాల్లో పారిశుధ్యానికి వేలాది వాహనాలను కొని ఇచ్చినా పారిశుధ్య సిబ్బంది పనిచేయడం లేదనీ, ప్రజారోగ్యానికి ముప్పువాటిల్లుతున్నదని ఒక బహిరంగ సభలో వాపోయారు. తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ప్రైవేటు పరిశ్రమల స్థాపనకు రైతుల భూములను సర్కార్ సేకరించి ఇవ్వడాన్ని జనం వ్యతిరేకిస్తే వారిపై పోలీసులు ఎంత జులుం చేశారో ప్రజలు మర్చిపోలేదు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం, మర్చిపోవడం కాంగ్రెస్ సర్కార్ సాధించిన ఘనత. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మూడు రాష్ర్టాల్లో మాత్రమే. అవి హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ. కర్నాటకలో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు కొనసాగించడం సాధ్యం కాదని ఆ రాష్ట్ర మంత్రులే స్వయంగా ప్రకటించారు. అనేక హామీలను అసలు ఆచరణ రూపంలో పెట్టలేకపోతున్నది.. సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్. ఇక తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఎలా పాతరేశారో తెలిసిందే కదా! రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న కేరళంలో ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలనే ఆబతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మళ్లీ ‘గ్యారెంటీలు’ పేరుతో మలయాళీలను మాయ చేసే ప్రక్రియను తిరువనంతపురంలో ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అధికారంలోకి వస్తే ప్రజలకు ఐదు మౌలిక సంక్షేమ గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. పేదల పింఛన్ నెలకు రూ.3 వేలకు పెంచుతామని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, కాలేజీకి వెళ్లే ఆడపిల్లలకు నెలకు రూ.1,000 సాయం అందిస్తామని వివరించారు. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంత ఘోరంగా పాలన సాగిస్తున్నాయో విజ్ఞులైన కేరళం ప్రజలకు తెలుసు. అయినా సరే నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టుగా అక్కడ కూడా కాంగ్రెస్ నేతలు గ్యారెంటీల గారడీ చేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం చెప్పిన మాటలు వ్యతిరేక ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ జనం సొమ్ముతో కేరళంలో కాంగ్రెస్‌ను గెలిపించాలనే అత్యాశ పడుతున్న రేవంత్‌రెడ్డికి, ఆయనను భుజాలపై మోస్తున్న రాహుల్‌కు ప్రగతిశీల, చైతన్య భావాలు కలిగిన మలయాళీ సమాజం తగిన గుణపాఠం చెప్పి తీరుతుంది.