కొందరు పిల్లలు ఎంత తిన్నా.. ఇంకా కావాలని అడుగుతుంటారు. పెద్దలు మాత్రం.. ఆహారపదార్థాలు నచ్చి, మళ్లీమళ్లీ తింటున్నారని అనుకుంటారు. అయితే, పిల్లల్లో అధిక ఆకలి.. ప్రేడర్-విల్లీ సిండ్రోమ్ అనే జన్యుపరమైన రుగ్మత లక్షణం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రోమోజోమ్లోని జన్యువుల లోపం వల్ల కలిగే ఈ రుగ్మత.. 30వేల మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుంది. ప్రేడర్-విల్లీ సిండ్రోమ్ ఉన్నవారు.. పుట్టినప్పుడు చాలా మెత్తగా ఉంటారు. పాలు తాగడానికీ ఇబ్బంది పడతారు.
ఇక రెండేళ్ల వయసు నుంచే వారిలో విపరీతమైన ఆకలి మొదలవుతుంది. ఎంత తిన్నా కడుపు నిండినట్లు అనిపించదు. ఇంకా ఇంకా తినాలనే అనుకుంటారు. దాంతో, వేగంగా బరువు పెరిగి.. ఊబకాయం బారినపడతారు. మరికొందరిలో హార్మోన్ల లోపం కనిపిస్తుంది. దాంతో, వయసుకు తగ్గట్టుగా ఎత్తు పెరగలేరు. వయసు పెరుగుతున్న కొద్దీ మేధోపరమైన సవాళ్లు కూడా ఎదురవుతుంటాయి. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతారు.
ఫలితంగా, తక్కువ ఐక్యూను ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి వారి ప్రవర్తన కూడా వింతగా ఉంటుంది. మంకుపట్టు పట్టడం, చీటికీమాటికీ కోపం రావడం, ఒకే పనిని పదేపదే చేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ప్రేడర్-విల్లీ సిండ్రోమ్ నివారణకు పూర్తిస్థాయి చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలతో లక్షణాలను నియంత్రించవచ్చని అంటున్నారు. విపరీతమైన ఆకలి వల్ల వచ్చే ఊబకాయాన్ని అరికట్టడానికి.. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని అందించాలి. ఎత్తు పెరగడం, కండరాల బలానికి వైద్యులను సంప్రదిస్తే.. హార్మోన్ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తారు. స్పీచ్ థెరపీ, ఫిజికల్ థెరపీ, బిహేవియరల్ థెరపీలతో పిల్లల అభివృద్ధికి తోడ్పడవచ్చు. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే నిపుణులను సంప్రదించాలి.