మడికొండ, మార్చి 10 : డంపింగ్ యార్డు తొలగించాలని కోరుతూ హనుమకొండ జిల్లా మడికొండ చౌరస్తాలో స్థానికులు మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. వరంగల్ నగరానికి చెందిన చెత్తను మడికొండ శివారులోని డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు.
దీనిపై కొన్నేండ్లు మడికొండ వాసులతోపాటు రాంపూర్, ఎలుర్తి గ్రామాల ప్రజలు సైతం ఆందోళన చేస్తున్నారు. దీన్ని తొలగించాలని కోరుతూ మంగళవారం డంపింగ్ యార్డు నిర్మూలన అడ్‌హక్ కమిటీ నేతృత్వంలో మడికొండలో రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలో పాల్గొన్న పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకుని నీళ్లు చల్లారు. డంపింగ్ యార్డును తరలించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అడ్‌హక్ కమిటీ నాయకులు హెచ్చరించారు.