మహబూబ్‌నగర్, జూలై 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను సర్కార్ ఇబ్బందులు పెడుతున్నది. ఇదే అదునుగా తాము చెబితే ప్రభుత్వం కొంటుందని నమ్మించి రైతుల వద్ద బలవంతంగా రూ.కోట్లల్లో కమీషన్ వసూలు చేసి పంచుకున్న కాంగ్రెస్ నేతల దందా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంచల నం సృష్టిస్తున్నది. నిజాం కాలంలో పంటకు కప్పం కట్టాలని హుకుం జారీ చేసినట్టు కాం గ్రెస్ నేతలంతా ఒక్కటై ఏకంగా 20లక్షల బస్తా ల దాకా బస్తాకు రూ.70 కమీషన్ వసూలు చేశారు. ఓ మార్కెట్ చైర్మన్ ఏకంగా మధ్యవర్తులను పెట్టి బలవంతంగా రైతుల వద్ద కమీషన్ వసూలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనేక ఫిర్యాదులు అం దినా కలెక్టర్ విచారణ చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. అటు మార్క్‌ఫెడ్ అధికారులు కూడా మౌనం దాల్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఒత్తిడి వల్లే విచారణ జరుగడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వెలుగుచూసిన ఈ కమీషన్ల బాగోతం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
కందనూలు జిల్లాలో భారీగా కొనుగోళ్లు
నాగర్‌కర్నూల్ జిల్లాలో యాసంగిలో రైతులు భారీగా మక్కజొన్నలు పండించారు. అమ్ముకోవడానికి మార్కెట్‌కు వస్తే ధర లేక తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజుల తరబడి పడిగాపులు కాశారు. ఇదే అదునుగా కాంగ్రెస్ నేతలు కమీషన్ల దందాకు తెరతీశారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని ఐదు మండలా ల్లో ఆయా సొసైటీల వద్ద కొనుగోలు జరిపారు. 5 కేంద్రాల ద్వారా 17,295మంది రైతుల నుంచి 20,70,368 బస్తాలు, 10,94,283 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇదంతా తాము చెప్పడం వల్లే సర్కార్ కొంటున్నదని రైతులను నమ్మించారు.
అమ్మిన మక్కలకు డబ్బులు తక్కువ రావడంతో రైతులు ఆందోళన చేయడంతో రాష్ట్ర ప్రభు త్వం ఆలస్యంగా మక్కజొన్నల కొనుగోలుకు ముందుకొచ్చింది. క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు ప్రారంభించారు. ప్రాథమిక సహకార సంఘంతోపాటు మార్క్‌ఫెడ్ ద్వారా సర్టిఫై చేసిన వేబ్రిడ్జి ద్వారా తూకం వేసి రైతులకు చీటీలు రాసిచ్చారు. రెండు నెలల తర్వాత మక్కలు అమ్మిన రైతులకు ఖాతాల్లో డబ్బులు జమకావడం మొదలైంది. తమకు ఇచ్చిన రసీదు ఒకలా ఉంటే కొంతమందికి డబ్బులు తక్కువ జమయ్యాయి. అప్పుడే ఈ కమీషన్ల దందా బయటకొచ్చింది.
దళారులను పెట్టి కమీషన్ వసూలు
నాగర్‌కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరులో రైతులు సుమారు 3వేల క్వింటాళ్లకు పైగా మక్కజొన్నలు పండించారు. వాటిని పీఏసీఎస్‌కు అమ్మడానికి వెళ్తే అధికార పార్టీకి చెందిన మార్కెట్ చైర్మన్ రమణారావు లోడిం గ్, అన్‌లోడింగ్‌తోపాటు ట్రాన్స్పోర్ట్ పేరిట ఒక్కో బస్తాకు రూ.70 ఇవ్వాలని రైతులను డిమాండ్ చేశారు. కమీషన్ ఇస్తేనే కొంటామని షరతు పెట్టడంతో గత్యంతరం లేక రైతులు డబ్బులు ఇచ్చారు. ఈ గ్రామంలో సుమారు 60లక్షల దాకా వసూలైనట్టు తెలుస్తున్నది.
వసూళ్లతో మాకు సంబంధం లేదు
కాంగ్రెస్ నేతల కమీషన్ల దందాపై కొంతమంది రైతులు నాగర్‌కర్నూల్ సొసైటీకి వెళ్లి సీఈవోను నిలదీశారు. ఓ రైతు ఫిర్యాదు మేరకు సదరు పీఏసీఎస్ కార్యదర్శి నరేశ్ వివరణ ఇచ్చారు. వసూళ్లతో తమకు సంబంధం లేదని ఇచ్చిన లేఖ.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది సదరు మార్కెట్ కమీటీ చైర్మన్ సొసైటీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని అనుచరులతో దబాయిస్తున్నారు. అంతేగాక ట్రాన్స్పోర్ట్ కోసం ఇందులోంచి లారీ ఓనర్లకు ఇస్తామని చైర్మన్ వివరణ ఇచ్చుకున్నారు. కానీ లారీ ఓనర్లు కూడా ఈ వసూళ్లతో తమకేం సంబంధం తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ నాయకుల కమీషన్ల బాగోతం బహిర్గతమైంది.
నిలదీస్తే కొనరని ఊరుకున్నం..
పంటను కాంటా వేసుకొని హమాలీ కూలీ అని డబ్బులు దండుకున్నరు. అడిగితే మక్కలు కొంటరో లేదోనని ఊరుకున్నం. చిన్నకారు రైతు నుంచి కూడా హమాలీ పేరుతో దోచుకున్నారు. నేను 31 సంచుల మక్కజొన్నలు పండించిన. లారీ ఎక్కించేందుకు బస్తాకు రూ.50 తీసుకున్నరు. అన్ని పనులు మాతో చేయించి కూలి ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు.
– బాబు, పెద్దముద్దునూర్, నాగర్‌కర్నూల్