Mega 158 | మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోరు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మన శంకర వరప్రసాద్ గారుతో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో చిరంజీవికి ఎదురుగా నిలిచే పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌కుమార్‌ని చిత్రబృందం ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజ జీవితంలో చిరంజీవి, శరత్‌కుమార్ అత్యంత సన్నిహిత మిత్రులు. వీరిద్దరూ గతంలో ‘గ్యాంగ్ లీడర్’ (1991), ‘స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్’ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత దాదాపు 35 ఏళ్ల విరామం అనంతరం మళ్లీ ఒకే సినిమాలో కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
గతంలో పలు సందర్భాల్లో శరత్‌కుమార్ మాట్లాడుతూ, చిరంజీవి తనకు అత్యంత ఆప్తమిత్రుడని, జీవితంలోని క్లిష్ట సమయంలో ఆయన తనకు అండగా నిలిచారని చెప్పారు. సరైన కథ కోసం ఎదురు చూస్తున్నామని, అవకాశం వస్తే మళ్లీ కలిసి నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నామని కూడా వెల్లడించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి, నివేదా పేతురాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఇటీవలి కాలంలో శరత్‌కుమార్ తెలుగు చిత్రాల్లోనూ వరుసగా కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘భరత్ అనే నేను’, ‘జయ జానకీ నాయక’, ‘భగవంత్ కేసరి’, ‘రంగబలి’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు చిరంజీవికి ప్రత్యర్థిగా ఆయన నటిస్తారనే ప్రచారం మరింత హైప్‌ను తీసుకొచ్చింది.