హనుమకొండ, జూలై 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎవరైనా అప్పుల్లో ఉంటే ఏం చేస్తారు? పొదుపు సూత్రాలు పాటించి, నష్టా న్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అంతేగానీ దుబారా చేస్తారా? అనవసరమైన ఖర్చులను నెత్తిన వేసుకుంటారా? కానీ తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) అదే పనిచేస్తున్నది.
రాష్ట్రంలోని సగం ప్రాంతానికి కరెంటు సరఫరా చేసే ఎన్పీడీసీఎల్ ఇప్పటికే రూ.12 వేల కోట్ల నష్టాల్లో ఉన్నది. కంపెనీ సీఎండీగా ఐఏఎస్ అధికారి రావడంతో సంస్థ గాడిన పడుతుందని అంతా భావించారు. కానీ లక్ష్యానికి భిన్నంగా ఆయన ప్రవర్తన ఉన్నదని సంస్థ ఉద్యోగులే విమర్శిస్తున్నారు. భారీగా నష్టాల్లో ఉన్న కరెంటు సంస్థను కాపాడుకునే అనేక చర్యల్లో పొదుపు కీలకమైనది.
ఖర్చును తగ్గించడంతోపాటు అనవసర భారాన్ని నెత్తిన వేసుకోకూడదనేది ప్రాథమిక నియమం. ఈ సీఎం డీ పనితీరు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. ప్రజాధనాన్ని దుబారా చేయడంతోపాటు, గతంలో ఎప్పు డూ చేయనివిధంగా కంపెనీతో సంబంధం లేని వాటికి భారీగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను ఆయా ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు భరించడం మొదటి నుంచి ఉన్నది. కానీ ఎన్పీడీసీఎల్ సీఎండీ బాధ్యతలు స్వీకరించింది మొదలు కొత్త సంప్రదాయానికి తెరలేపారని ఉద్యోగులు చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో భట్టి విక్రమార్క పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్ల ఖర్చును కంపెనీ భరిస్తున్నదని చెప్తున్నారు. ఇలా ఇప్పటివరకు రూ.20 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇలా ప్రభుత్వ రంగ సంస్థ నిధులతో మంత్రుల కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలోని ఓ ప్రముఖ రాజకీయ కుటుంబంతో, ముఖ్యనేత బంధువుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ప్రభుత్వంలో తనకు ఎదురులేదని ఈ ఐఏఎస్ అధికారి అందరితో చెప్పుకుంటున్నారట. ఆయన ముఖ్యనేత బంధువు ఇంట్లో పెళ్లి, హల్దీ ఫంక్షన్లో డ్యాన్స్ చేసి మరీ వారిని మురిపించారనే చర్చ జరుగుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మహిళా అధికారిని బదిలీ చేయించి, ఆ పోస్ట్‌లోకి ఐఏఎస్ అధికారి అయిన తన భార్యను నియమించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్పీడీసీఎల్ ఉద్యోగుల బదిలీల్లోనూ నిబంధనలు, పనితీరు కంటే తన సొంత అభిప్రాయానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. నచ్చిన వారికే ప్రాధా న్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతగా యత్నించినా బదిలీలు కావడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. వృథా ఖర్చు ల ఆరోపణలపై సీఎండీ వివరణ కోసం పలురకాలుగా సంప్రదించినప్పటికీ అందుబాటులోకి రాలేదు.