నిజామాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు (గురువారం) కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం గజ్వేల్‌లో నామినేషన్ వేసి మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డికి హెలికాప్టర్లో చేరుకుంటారు. నామినేషన్ పత్రాలను ఆర్డీవో కార్యాలయంలో ఆర్వోకు స్వయంగా కేసీఆర్ అందిస్తారు. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారిగా ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జన హారతి పట్టేందుకు నిర్ణయించారు. ఘనం గా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. సీఎం బహిరంగ సభపై ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేయగా, కేసీఆర్‌ను స్వయంగా చూసేందుకు, ఆయన చెప్పే విషయాలను ఆలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎనిమిది మండలాల నుంచి పెద్దసంఖ్యలో తరలిరానున్న జనం కోసం బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది.
పదేండ్లలో కామారెడ్డి ప్రాంతానికి కేసీఆర్ చాలాసార్లు వచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నా రు. నియోజకవర్గం గొప్పతనాన్ని కొనియాడడంతోపాటు ఈ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి నెరవేర్చారు. ఈసారి పర్యటన మాత్రం ప్రత్యేకతను సంతరించుకునున్నది. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి స్వయంగా ఆయనే పోటీ చేస్తుండడంతో గులాబీ బాస్ రాకపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. తన అభ్యర్థిత్వం ఖరారయ్యాక కేసీఆర్ రాక ఇదే తొలిసారి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులంతా పార్టీ అధినేతను ఘనంగా ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటన రావడమే తరువాయి.. స్థానిక ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి, ఏకగ్రీవ తీర్మానాలతో హోరెత్తించారు. స్వచ్ఛందంగా వచ్చిన మద్దతులతో బీఆర్ఎస్లో జోష్ నింపగా, కేసీఆర్ రాకతో.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహం కనిపిస్తున్నది.
కామారెడ్డి నియోజకవర్గానికి కేసీఆర్ స్వయంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించనుండగా, కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు సైతం హాజరయ్యే అవకాశం ఉన్నది. స్పీకర్ పోచారంతోపాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు కేసీఆర్ నామినేషన్ ప్రక్రియలో భాగం కానున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయడం కేసీఆర్‌కు సెంటిమెంట్. నాలుగున్నర దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని గులాబీ దళపతి మొన్ననే పూర్తిచేశారు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి దేవదేవుడి ఆశీర్వాదాలను పొందారు. సన్నిహితులు, కుటుంబీకులు, గులాబీ పార్టీ శ్రేణులు హాజరైన ఈ కార్యక్రమం.. అట్టహాసంగా పూర్తికాగా, నామినేషన్ పత్రాల సమర్పణ మిగిలింది. కేసీఆర్ మొదటగా గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేస్తారు. అక్కడినుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కామారెడ్డికి చేరుకొని నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేస్తారు.
కేసీఆర్ రాక సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అమితాసక్తి ఏర్పడింది. ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కిన కేసీఆర్.. తమ ప్రాంతం నుంచి పోటీ చేస్తుండడంపై ఇప్పటికే సర్వత్రా చర్చనీయాంశమైంది. కేసీఆర్ రాకతో ప్రజలు.. కామారెడ్డి దిశ, దశ మారుతుందనే నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభ వేదికగా కామారెడ్డి నియోజకవర్గానికి బీఆర్ఎస్ అధినేత వరాలు ప్రసాదించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంత అవసరాలను తీర్చడంతోపాటు గెలిచిన తర్వాత సీఎం హోదాలో కామారెడ్డి ప్రాంతానికి తలపెట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల సరళిని కేసీఆర్ వివరిస్తారని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు.
కామారెడ్డి, నవంబర్ 8 : కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు తదితరులు పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.