ఎల్లారెడ్డి పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జనం అశేషంగా తరలివచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రజలు కదిలివచ్చారు. మైదానం మొత్తం జనంతో నిండిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సభా ప్రాంగణం చుట్టూ చక్కర్లు కొట్టడంతో సభకు హాజరైన జనమంతా లేచి జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు.
అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆద్యంతం ఆకట్టుకున్నది. సమైక్య పాలనలో ప్రజలు పడిన గోస, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో తీరిన ఇబ్బందులు, సంక్షేమ పథకాలపై వివరించగా జనం ఆసక్తిగా విన్నారు. ఎల్లారెడ్డిని మరింత అభివృద్ధి చేసే బాధ్యత తనదేనంటూ ప్రకటించడంపై చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. ఎల్లారెడ్డి అభ్యర్థి జాజాల సురేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలని సీఎం కేసీఆర్ కోరగా.. అందుకు స్పందించిన జనం… జై కేసీఆర్ అంటూ నినదించారు.