ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు పరుగలు పెడుతున్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వందల కోట్ల నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. గొలుసు కట్టు చెరువులకు పునర్జీవం కలిగించేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి సీఎం కేసీఆర్ ఇక్కడే శ్రీకారం చుట్టారు. ప్రతి చెరువూ జలకళ సంతరించుకోవడంతో వ్యవసాయం పండుగలా మారింది. భారీగా నిధులు మంజూరు చేయడంలో అన్ని మండలాలకు రోడ్డు సౌకర్యం ఏర్పడింది. ఎల్లారెడ్డిలోని సర్కారు దవాఖానను వంద పడకల ఏరియా దవాఖానగా మార్చడంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నది. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఎల్లారెడ్డిని పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చింది. రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేయడంతో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డిని అభివృద్ధిలో మెరిసేలా చేశారు.
-ఎల్లారెడ్డి, మార్చి 27
వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా చెరువులకు పూర్వవైభం తెచ్చేందుకు మొదటగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి సీఎం కేసీఆర్ ఇక్కడే శ్రీకారం చుట్టారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎలారెడ్డి చెరువుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం.. రైతుల బతుకులను పూర్తిగా మార్చేసింది. నియోజకవర్గానికి నాలుగు విడుతల్లో రూ.110 కోట్లు కేటాయించి 265 చెరువులను పునరుద్ధరించారు. చెరువు కట్టలను బలోపేతం చేయడంతోపాటు లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసి భూములను సారవంతం చేసేందుకు ఆ మట్టిని పొలాలకు తరలించారు. తూములకు మరమ్మతు చేశారు. దీంతో ఎండకాలంలోనూ చెరువుల్లో పుష్కలంగా నీరు అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా మరో 20వేల ఎకరాల్లో పంటలసాగు పెరిగింది. ఎల్లారెడ్డిలోని పెద్ద చెరువు కట్టపై ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం రూ. 5 కోట్లు మంజూరు కావడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
మెరుస్తున్న రహదారులు…
రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన తారురోడ్లపై ఏర్పడిన గుంతలు ప్రయాణికులకు నరకం చూపించేవి. గతానికి భిన్నంగా నియోజకవర్గంలోని అన్ని రహదారులు మెరుస్తున్నాయి. రోడ్డు మార్గాల్లో రూ. 17 కోట్ల నిధులతో బ్రిడ్జిలు నిర్మించారు. నాగిరెడ్డిపేట మండలంలోని వెంకంపల్లి శివారులో మంజీరా నదిపై రూ. 18కోట్లతో బ్రిడ్జి, రూ. 32 కోట్ల రహదారి నిర్మాణం పూర్తయ్యాయి.
ఎల్లారెడ్డి మండలంలోని శివనగర్ నుంచి రుద్రారం వరకు రూ. కోటి నిధులతో బీటీ రోడ్డు నిర్మించడంతో పది గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. రూ. 11కోట్ల నిధులతో లింగంపేట మండలంలోని నల్లమడుగు రోడ్డు పనులు చేపట్టారు. ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామం నుంచి లింగంపేట మండలం కొండాపూర్ వరకు రూ. రెండుకోట్లతో రహదారి నిర్మించారు. తాజాగా మరో రూ. మూడు కోట్లు మంజూరు కావడంతో సీతాయిపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఎల్లారెడ్డి మండలంలోని మీసాన్ పల్లి నుంచి లింగంపేట మండలం శెట్పల్లి వరకు రూ. కోటి నిధులతో బీటీ రోడ్డు వేశారు. మిగతా పని కోసం మరో రూ. కోటీ 27 లక్షలు మంజూరయ్యాయి. గాంధారి మండలకేంద్రంలో ప్రధాన రహదారిని విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9 కోట్లు కేటాయించింది. రూ. 5కోట్లతో ఎల్లారెడ్డి పెద్దచెరువు కట్టకు ఇరువైపులా వంతెనలు నిర్మించడంతో వాహనాల ప్రయాణానికి ఇబ్బందులు తొలగిపోయాయి. రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తున్నాయి.
ఎల్లారెడ్డికి కొత్త అందాలు..
ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న ఎల్లారెడ్డిని గ్రామ పంచాయతీగా మారింది. ఇది అప్పటి పాలకుల పనితీరుకు నిదర్శనం. పాలను ప్రజలచెంతకు తెచ్చేందుకు తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం చేపట్టిన చర్యలో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డిని తిరిగి మున్సిపాలిటీగా మార్చడంతోపాటు డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ. 25 కోట్లు మంజూరు చేయడంతో పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. రూ. రెండు కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. రూ. మూడు కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎల్లారెడ్డి పెద్దచెరువు కట్ట నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు డబుల్ రోడ్డు, డివైడర్ నిర్మించి అందమైన మొక్కలు నాటారు. అంబేద్కర్ చౌరస్తా, గాంధీచౌక్, పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో హైమాస్ట్ లైట్లు, సెంట్రల్ లైటింగ్, ఎల్ఈడీ వెలుగులతో పట్టణం మెరిసిపోతున్నది. రూ. 4కోట్లతో పట్టణంలోని 12 వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మించారు. పట్టణ ప్రజల కోసం గండి మాసానిపేట, లింగారెడ్డిపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దావాఖానల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.