కాంగ్రెస్ పార్టీకి 11సార్లు ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని పరిపాలించేందుకు అవకాశమిస్తే 55 ఏండ్ల పాటు ప్రజలను పీల్చుకుని తిన్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. వారిని నమ్ముకుంటే కారు చీకట్లు, పాము కాట్లు, కరెంట్ షాకులు తప్పవని హెచ్చరించారు. వేల్పూర్ ఎక్స్ రోడ్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. వేల్పూర్‌కు వెల్లువెత్తిన జన సంద్రాన్ని చూసి ముఖ్యమంత్రి ముగ్ధులయ్యారు. మిమ్మల్ని చూస్తేనే ప్రశాంత్‌రెడ్డి విజయం ఖాయమైనట్లు అర్థమైందన్నారు. ప్రశాంత్‌రెడ్డికి ముందు బాల్కొండలో ఏం జరిగింది. ప్రశాంత్‌రెడ్డి కాలంలో ఏం జరిగిందో చర్చ చేసి, ఆలోచన చేసి ఓటెయ్యాలని కోరారు.
నిజామాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కమ్మర్పల్లి: కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కారు చీకట్లు, పాము కాట్లు, కరెంట్ షాకులు తప్పవని సీఎం కేసీఆర్ అన్నారు. 11 సార్లు ఈ దేశాన్ని పరిపాలించేందుకు అవకాశమిస్తే 55 ఏండ్లపాటు ప్రజలను పిండుకొని తిన్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటు హక్కును వృథా చేసుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలకు అసలే వేయొద్దన్నారు. ఆలోచన చేసి ప్రజలకు మేలుచేస్తున్న బీఆర్ఎస్కే ఓటెయ్యాలని సూచించారు. వేల్పూర్ మండలకేంద్రంలోని స్పైసెస్ పార్కులో గురువారం నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఏకబిగిన 55 ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిందని, ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే నమ్మొద్దన్నారు. అధికారంలో ఉన్ననాడు వాళ్లు ఏంచేశారో ఆలోచించాలన్నారు. బాల్కొండలో ప్రశాంత్‌రెడ్డికి ముందు, తర్వాత ఏం జరిగిందో చర్చించి ఓటెయ్యాలని కోరారు. ఆయన 18 సబ్ స్టేషన్లు కట్టిండని, పవర్ ట్రాన్స్ఫార్మర్లు నలభైకి పైగా తెచ్చిండని తెలిపారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్ననాడు ఒక్క సబ్‌స్టేషన్ కోసం మూడేండ్లు తిరిగానని గుర్తుకు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ రాజ్యంలో సగం రాత్రి, సగం పొద్దున కరెంట్ ఉండేదని, గా రాజ్యమే కావాల్నా..? కరెంట్ కాట్లు కావాల్నా..? ఆలోచించాలన్నారు.
‘ఓటు అనేది విలువైన వజ్రాయుధం. ఉల్టా వినియోగిస్తే ఐదేండ్ల భవిష్యత్తును కిందమీదికి జేస్తుంది. ఓటు మన కిస్మత్‌ను మారుస్తుంది. తమాషాకు ఓటెయ్యెద్దు. ఎవరికి వారు చర్చ చేసి నిర్ణయానికి రావాలె. చర్చ జరిగి ఓటేసే కాలం వచ్చిన్నాడు గ్యారెంటీగా ప్రజలు గెలుస్తారు. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యంలో నిజమైన గెలుపు’
ఆర్మూర్, బాల్కొండలో ఎర్రజొన్నలు పండిస్తే, విత్తనాల కోసం పంజాబ్‌కు పోతాయని, పచ్చజొన్నలు తినేట్లు ఉన్నదా అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నలకు మార్కెట్లో ధర లేకున్నా ప్రభుత్వమే కొనుగోలుచేసి రైతుల కోసం నష్టాలను అనుభవిస్తున్నదని చెప్పారు. మునుపు ధాన్యం తీసుకొని వారాలు గడిచినా రైతులకు డబ్బులిచ్చేవారు కాదని, ఇప్పుడు పది రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయని తెలిపారు. రైతుబంధు కూడా టింగ్ టింగ్ మంటూ అకౌంట్లో పడుతున్నదని సీఎం తెలిపారు. రైతు చనిపోతే పైరవీల్లేకుండా ఆ కుటుంబానికి రూ. 5లక్షల బీమా డబ్బులు వచ్చేలా పథకం తెచ్చామన్నారు. కాంగ్రెస్ సర్కారులో ఆపద్బంధు కింద రూ. 50వేలు చేతికి రావాలంటే చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేదని, రూ. 10వేలు చేతికిచ్చి మిగిలింది పైరవీకారులే బుక్కేవారని గుర్తుచేశారు. ధరణితో భూసమస్యలకు చెక్ పడిందన్నారు. నిమిషాల్లోనే పట్టా అయిపోతున్నదని తెలిపారు. మధ్యప్రదేశ్, ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్లో ఎరువుల కోసం చెప్పుల లైన్లు ఉన్నాయన్నారు. ఆర్మూర్‌లో నాడు ఎర్రజొన్నల రైతులను కాల్చేయలేదా అని ప్రశ్నించారు. రైతుల బకాయిలు తాను సీఎం అయ్యాకే రూ.11కోట్లు చెల్లించినట్లు చెప్పారు. దళితబంధు పథకం తన మానస పుత్రిక అంటూ కేసీఆర్ చెప్పారు. తప్పకుండా అమలు చేసి చూపిస్తానన్నారు. రేషన్‌కార్డు ఉన్న 93లక్షల మందికి రైతుబీమా మాదిరిగానే కేసీఆర్ బీమా పెడతామని, ఆరోగ్యశ్రీని రూ.15లక్షలకు పెంచుతామని చెప్పారు. ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు నమస్తే తెలంగాణ సీఎండీ, రాజ్యసభ సభ్యుడు దామోదార్ రావు, ఎంపీ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మార గంగారెడ్డి, మధుశేఖర్, రాజేశ్వర్‌రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎండీ రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, కోటపాటి నర్సింహనాయుడు, బాల్కొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మహారాష్ట్ర రైతు నాయకుడు రఘునాథ్ దాదా పాటిల్ బృందం పాల్గొన్నారు.
ప్రశాంత్‌రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదని, తనకు కొడుకులా.. సొంత మనిషిలా ఉంటాడని కేసీఆర్ కితాబిచ్చారు. క్యాబినెట్లో బాధ్యత గల పదవిలో ఉన్నాడని, రేపు కూడా అట్లనే పెద్ద మనిషిలా ఉంటాడని హామీ ఇచ్చారు. దీంతో బాల్కొండ కూడా పెద్దగానే అభివృద్ధి జరుగుతుందన్నారు. హెలిప్యాడ్ వద్దకు వచ్చిన జనాలను చూడగానే వేముల బ్రహ్మాండమైన మెజారిటీతో గెలువబోతున్నాడని అర్థమైందన్నారు. దేశంలోనే 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టిందని, రైళ్లు, ఓడరేవులు, కరెంటును ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టి ముక్కుపిండి పైసలు వసూలు చేయాలని బెదిరించినా తాను పెట్టలేదని చెప్పారు. తెలంగాణలో వలసలు, కరువు, మంచినీళ్లు లేని దుస్థితి ఉండేదని, తలాపున నీళ్లున్నా మంచినీళ్లు దొరకలేదన్నారు. 55ఏండ్ల కిందటి తెలంగాణ కావాలని భావించి, రైతు దగ్గర డబ్బుండాలనే పాలసీ పెట్టుకొని ఐదారు చర్యలు తీసుకున్నామన్నారు. ఫ్రీ కరెంట్, పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని చెప్పారు. నీటి తీరువా పన్ను రద్దుచేశామని గుర్తుచేశారు.
బాల్కొండకు ఎప్పుడొచ్చినా గుర్తుకు వచ్చేది మోతె గ్రామమని, ఆ గ్రామ మట్టిలో ఉన్న బలం అలాంటిదని కేసీఆర్ ఉద్యమకాలం నాటి గుర్తులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఉద్యమంలో అందరి కన్నా ముందు మోతె గ్రామం తీర్మానం చేసి తెలంగాణ కావాలని పిడికిలెత్తి నిలబడిందన్నారు. మోతె గ్రామం మట్టిని ముడుపు కట్టి హైదరాబాద్‌కు తీసుకుపోయానని, తెలంగాణ వచ్చాక అదే మట్టిని తెచ్చి మోతెలో కలిపానంటూ వివరించారు. ఈ సందర్భంగా వేదికపై మోతె గ్రామానికి శిరస్సు వంచి నమస్కరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా రాజకీయ పరిణితి పెరగడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే ఎవ్వడిని పడితే వాణ్ని ఇష్టమొచ్చినట్లు తిట్టే దుష్ట సంప్రదాయం ఏర్పడిందని ఆవేదన చెందారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, ఉల్టా వినియోగిస్తే ఐదేండ్ల భవిష్యత్తును కిందమీదికి జేస్తుందని చెప్పారు. ఓటు మన కిస్మత్‌ను మారుస్తుందన్నారు. తమాషాకు ఓటెయ్యుద్దని సూచించారు. ఎవరికి వారు చర్చించి ఓటేసిననాడు గ్యారంటీగా ప్రజలు గెలుస్తారని, అదే ప్రజాస్వామ్యంలో నిజమైన గెలుపని అన్నారు.