మహోగ్ర రూపం దాల్చిన గోదావరి, మంజీర
నష్టం జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టిన ప్రభుత్వం
క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా స్పందించిన సీఎం కేసీఆర్
బహుముఖ వ్యూహం అమలు చేసిన ముఖ్యమంత్రి
వరద ప్రవాహంపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు
తీవ్ర విపత్తు తలెత్తిన వేళ ప్రభుత్వం వాయు వేగంతో స్పందించింది. కుండపోత వానల నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగాన్ని కదన రంగంలోకి పంపింది. 30 ఏండ్ల నాటి వరదలను తలపిస్తూ గోదావరి, మంజీర ఉగ్రరూపం దాల్చిన తరుణంలో.. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించడమే లక్ష్యంగా బహుముఖ వ్యూహం అమలు చేశారు. లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేతలను సహాయక చర్యలకు పురమాయించారు. గోదావరి, మంజీర పరవళ్లకు అనుగుణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయిస్తూ ‘గంగమ్మ’ను సురక్షితంగా జిల్లా దాటించారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ‘ఆపరేషన్ ఫ్లడ్’ను విజయవంతంగా పూర్తి చేశారు.
నిజామాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉత్తర తెలంగాణలో కురిసిన ఊహకు అందని వానలతో అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా మెదిలింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పకడ్బందీగా వ్యవహరించారు. వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న సీఎం ఏకంగా కదనరంగంలోకి దిగి వెనువెంటనే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి అ త్యుత్తమ నిర్ణయం తీసుకున్నారు. విపత్తను ముందే ఊహించిన కేసీఆర్ అందుకు తగ్గట్లుగా ప్రభుత్వ యం త్రాంగాన్ని, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేసి ప్రజల్లోకి దించారు. అనుకున్నది అనుకున్నట్లుగా ప్రణాళికలను అమలు చేసి అతి తక్కువ నష్టాలతో ముప్పు నుంచి బయట పడడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రగతిభవన్ వేదికగా గడిచిన 10 రోజులుగా తీసుకున్న ప్రతి నిర్ణయం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అమలైంది. గోదావరి ముఖ ద్వారం కందకుర్తి వద్ద వచ్చే వరదను అనుక్షణం అంచనా వేయడం ద్వారా ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద అవుట్ ఫ్లోను సమన్వయం చేశారు. తద్వారా ముప్పు తీవ్రతను కాసింత తగ్గిస్తూ ముందుకెళ్లారు.
అవుట్ ఫ్లో 75 టీఎంసీలు…
వాతావరణ శాఖ ఈ నెల 8న నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ సమయానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కేవలం 30.147 టీఎంసీలు మేర నీళ్లు నిల్వ ఉన్నాయి. అవుట్ ఫ్లో 12వేల నుంచి ఒకే రోజులో సాయంత్రానికి 27వేల క్యూసెక్కులకు ఎగబాకింది. ఇలా క్రమంగా గంటల్లో, రోజుల్లో లక్షల క్యూసెక్కుల వరద రావడంతో మూడు రోజుల్లోనే ఎస్సారెస్పీలో నీటి మట్టం 70టీఎంసీలకు చేరింది. పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న భారీ వానలకు తోడు గోదావరిలో వరద ఉధృతి నేపథ్యంలో ఎస్సారెస్పీ వరద గేట్లను ఈ నెల 10న వదిలారు. తొలుత 9 గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి నీళ్లను పంపించారు. ఇదే సమయంలో వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు 12వేల క్యూసెక్కులు నీళ్లను వదిలారు. జెన్కో విద్యుత్ ఉత్పత్తికి 6వేల క్యూసెక్కులు విడిచిపెట్టారు. వేల క్యూసెక్కుల ప్రవాహం కాస్త లక్షల్లోకి చేరడంతో 75 టీఎంసీల స్థిర నీటి నిల్వతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు పంపాలని సీఎం నిర్ణయించారు. పూర్తి స్థాయి నిల్వకు 15 టీఎంసీలు మేర జలాలను ఖాళీగా ఉంచుతూ వరదను పంపించారు. గరిష్ఠంగా ఈ నెల 13న 36గేట్ల ద్వారా 4లక్షల 90వేల క్యూసెక్కుల మేర వదిలి వరదను నియంత్రించారు. ఇలా కేవలం 8 రోజుల కాల వ్యవధిలో 75.406 టీఎంసీలు మేర ఎస్సారెస్పీ ద్వారా దిగువకు వరద ప్రవహించింది.
8 రోజుల్లో 100 టీఎంసీలు…
జూన్ 1న ప్రారంభమైన వానకాలం సీజన్ నుంచి జూలై 15వ తేదీ వరకు ఎస్సారెస్పీకి 131 టీఎంసీలు మేర వరద రావడం రికార్డుగా ఇరిగేషన్ ఇంజినీర్లు పోల్చుతున్నారు. ఇంత భారీ వరదను కేవలం సెప్టెంబర్, అక్టోబర్ నెలలోనే ఊహిస్తామని అందుకు భిన్నంగా అధిక వర్షపాతంతో ఈ పరిస్థితి నెలకొన్నదని చెబుతున్నారు. 45 రోజుల్లో వచ్చిన మొత్తం వరదలో 8 రోజుల్లోనే 98.112 టీఎంసీలు మేర వరద పోటెత్తిందని చెబుతున్నారు. వచ్చిన మొత్తం ఇన్‌ఫ్లోలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో 57శాతం దిగువకు జలాలను పంపించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 14న మధ్యాహ్నం 12గంటల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నదిలో ప్రశాంతత కనిపిస్తున్నది. వాగులు, వంకల గుండా వస్తున్న ప్రవాహాలతో వరద ఎస్సారెస్పీలోకి చేరుతున్నది. ఇన్‌ఫ్లో తగ్గడంతో అవుట్‌ఫ్లోను భారీగా కుదించారు. ఎగువ లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో కొన్ని గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల మేర అవుట్ ఫ్లోను మెయింటెయిన్ చేస్తున్నారు. కరీంనగర్లోనూ భారీ వానలతో మిడ్ మానేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో వరద కాలువకు నీటి విడుదల నిలుపుదల చేసి వరద గేట్ల ద్వారానే వరదను దిగువకు పంపిస్తున్నారు.
మంజీర ఉగ్రరూపం…
ఆగస్టు నెలాఖరు వరకు కనీసం చుక్కబొట్టు కనిపించని మంజీరా నదిలో ఈసారి భారీ ప్రవాహంతో పరీవాహక ప్రాంత ప్రజలు నివ్వెర పోయారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తకుండా ఇంతటి ప్రవాహం చూడడం చాలా అరుదుగా చెప్పుకుంటున్నారు. అతి భారీ వానలతో వాగులు, వంకల గుండా వచ్చిన వరద మంజీరలో కలిసి ఉవ్వెత్తున ప్రవాహం కొనసాగింది. కందకుర్తి వద్ద ఇతర నదులతో సంగమించడం ద్వారా వరద పోటెత్తింది. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉగ్రరూపంలో పాత వంతెన పైనుంచి ప్రవహించింది. గోదావరిలో రికార్డు స్థాయిలో 75టీఎంసీలు మేర నీళ్లు నిల్వ ఉండడం, ఎగువ నుంచి లక్షల క్యూసెక్కుల ప్రవాహం తోడవ్వడంతో నది పరీవాహకం కాస్త భూఉపరితలానికి ఆనుకుని ముందుకు సాగింది. దీంతో పలుచోట్ల పరీవాహక ప్రాంతాల్లో గోదావరి వరదతో మూలంగానే పంట నష్టాలు సంభవించడం వెలుగు చూసింది. కందకుర్తితో పాటు మంజీరా నదిని ఆనుకుని ఉన్న బోధన్ మండలంలోని హంగర్గా, బిక్నెల్లి గ్రామం సైతం వరద ముప్పును తీవ్రంగా ఎదుర్కొన్నాయి. ఇంతటి వర్ష బీభత్సం 30 ఏండ్ల క్రితం నాడు చూసినట్లు పలువురు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.