
Chain snatching | వినాయకనగర్, డిసెంబర్ 10 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నగరంలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇద్దరు మహిళల మెడలోంచి చైన్ స్నాచర్లు బంగారు గొలుసులు తెంచుకుని పరారైన ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. కాలనీ వాసులు, బాధితుల కథనం ప్రకారం.. నగరంలో నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్ ఏరియాలో ఉదయం 7.29 నిమిషాల సమయంలో స్వరూప అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్ పై ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చారు.
హెల్మెట్ ధరించి ఉన్న దుండగుడు బైక్ పై కూర్చుని ఉండగా, వెనకాల ఉన్న మరో దుండగుడు ముఖానికి మాస్క్ నెత్తిపై టోపీ ధరించి ఉన్నాడు. బైక్ వెనకాల ఉండి దిగివచ్చిన సదరు దుండగుడు ఆ మహిళ వద్దకు వచ్చి ఈ అడ్రస్ ఎక్కడా అంటూ నమ్మించి ఆమె మెడలోని రెండు తులాల బంగారు పూసల గొలుసు తెంపుకొని బైక్ పై ఇద్దరు దుండగులు పరారయ్యారు.
ఆమె మెడలోంచి బంగారు గొలుసు తెంచిన వెంటనే ఆమె గట్టిగా కేకలు వేసినప్పటికీ చుట్టుపక్కల ఇండ్లలోంచి ఎవరు బయటికి రాకపోవడంతో దుండగులు అక్కడ నుంచి బైక్ పై పరారయ్యారు. మరో ఘటన నగరంలోని కసాబ్ గల్లి ప్రాంతంలో మరో మహిళ ఇంటి ముందు నిలబడి ఉండగా బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలో నుంచి సైతం బంగారు గొలుసు తెంచుకొని పారిపోయినట్లు సమాచారం. ఈ రెండు ఘటనల పై బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అయితే దుండగులు బైక్ పై వచ్చి మహిళ మెడలోంచి బంగారు గొలుసు తెంచుకొని పారిపోతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.