బోధన్, మే 15: ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఎరువుల ధరల పెంపుదలతోపాటు సవాలక్ష సమస్యల తో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుడి నెత్తిపై మరో పిడుగు పడింది. అదే పెట్రో బాంబ్. పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం నుంచి కేంద్రం ప్రభుత్వం పెంచడంతో సామాన్యుడి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ సర్కార్ తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకున్నది. ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు మూడు రూపాయలకు పైగా పెంచింది.
రాష్ట్రంలోనూ, అందులో భాగంగా జిల్లాలోనూ ఈ పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటలకు అన్ని పెట్రోల్ బంకుల్లోనూ అమల్లోకి వచ్చాయి. వేకువజాము నుంచే బంకులకు పెట్రోల్ కోసం వెళ్లిన వాహనదారులు, ట్రాక్టర్లు, మోటారు పుంపుల కోసం అవసరమయ్యే డీజిల్ కోసం వెళ్లిన రైతులు పెరిగిన ధరలను చూసి షాక్కు గురయ్యారు. జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.3.39 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.3.27 పైసలు చొప్పున పెరిగింది.
దీంతో ఇప్పటివరకు రూ.108. 82గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు 112.21 రూపాయలకు, రూ.97.09గా ఉన్న డీజిల్ ధర ఇప్పుడు 100.35 రూపాయలకు పెరిగినట్లయ్యింది. పవర్ పెట్రోల్ ధరలను కూడా పెంచారు. ఇప్పటివరకు రూ.118.82 గా ఉన్న లీటర్ పవర్ పెట్రోల్ ధర ఇప్పుడు రూ.122.53కు పెరిగింది. అంటే, పవర్ పెట్రోల్ ధర లీటర్కు రూ.3.71 పెరిగిందన్న మాట. ఇప్పుడు పెరిగిన ధరలే సామాన్యులు, రైతులపై మోయలేని భారంగా ఉండగా, మున్ముందు ఇంకా ధరలు పెరుగుతాయన్న సంకేతాలు వస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది.
వ్యవసాయ రంగంపై పెరిగిన డీజిల్ ధరలు ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఇప్పటికే అన్నదాతలు ఎరువుల ధరల పెరుగుదల, గిట్టుబాటు ధరలు లేకపోవడం, పురుగు మందుల ధరలు మండిపోతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధునిక వ్యవసాయ పనుల్లో డీజిల్ అవసరం ఎంతో ఉంది. దుక్కులు దున్నడం మొదలు, వరి కోతలు, ధాన్యం రవాణా కోసం ట్రాక్టర్లపైనే రైతులు ఆధాపడుతున్నారు. వరి కోత మెషిన్ల వినియోగం కూడా ఎక్కువగా ఉంది. మోటార్ పంపులు, ఇతర ఆధునిక వ్యవసాయ పరికరాలకు కూడా డీజిల్ అవసరం. పెరిగిన ధరలతో ఇప్పుడు సాగు వ్యయం విపరీతంగా పెరిగి అన్నదాతలకు ఇక్కట్లు తప్పేలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క వారి సంక్షేమ పథకాలపై కోత పెడుతుండగా, కేంద్ర సర్కార్ పెంచిన పెట్రో ధరలు వారి పాలిట శాపంగా మారింది.
ఎరువుల ధరలను వందల్లో పెంచుతూ మద్దతు ధరలను మాత్రం రూ.30 నుంచి రూ.40 వరకు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడీ డీజిల్ ధరలు పెంచడం దారుణం.ఇదేనా మోదీ చెబుతున్న రైతుల సంక్షేమం..? ఇక్కడే కాదు.. ఏ రాష్ట్రంలోనూ ప్రధాని మోదీ రైతుల కోసం చేసిందేమీ లేదు. పెరిగిన ఎరువుల ధరలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో మా రైతులపై విపరీతమైన భారం పడుతుంది. పండించిన పంటలకు ధరలు మొత్తుకుంటుంటే.. రైతులను మరింత కష్టం తెస్తూ డీజిల్ ధరలు పెంచుడేంది.. ఇదేం న్యాయం.
-కేజీ గంగారాం, రైతు, సాలూర
ఐదు రాష్ర్టాల ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెంచుతుండడం చూస్తుంటే ఓడ దాటేవరకు ఓడ మల్లన్న,. దాటినంక బోడి మల్లన్న అన్నట్లుగా ఉంది మోదీ సర్కార్ తీరు.. మొన్నటివరకు పెట్రోల్ వినియోగం తగ్గింపుపై ఎటువంటి చర్యలు తీసుకోని ప్రధాని మోదీ.. ఆ ఎన్నికల తర్వాత ఇంధన వనరుల వినియోగం తగ్గించుకోవాలని పిలుపు ఇవ్వడం హాస్యాస్పదం. కేవలం ఎన్నికల్లో ప్రయోజనం కోసం అప్పుడు ఇంధనం పొదుపుపై ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలతో సామాన్యుల పరిస్థితి ఏం కావాలి.. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలను ఉపసంహరించుకోవాలని డిమాండ్చేస్తున్నాం.