నిజామాబాద్, మే 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోతున్న సర్(ఎస్ఐఆర్)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ ప్రక్రియపై ఉర్రూతలూగుతోంది. మిగిలిన రాజకీయ పక్షాలు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రక్రియపై దుమారం రేగుతోన్న దరిమిలా రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులను భారత రాష్ట్ర సమితి అప్రమత్తం చేసింది. బీజేపీ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న క్రమంలో అడుగడుగునా అలర్ట్గా ఉండాలని శ్రేణులను పిలుపునిచ్చింది.
ఇప్పటి వరకు అనేకమార్లు ఓటరు సవరణ ప్రక్రియ జరిగినప్పటికీ ఈసారి మాత్రమే అనుమానాలు కలుగుతుండటం సగటు సామాన్య జనాల్లో సైతం చర్చకు దారి తీస్తోంది. ఉద్దేశపూర్వకంగా కొన్ని వర్గాల ఓట్లను తొలగించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బోగస్ ఓటర్ల ఏరివేత, డబుల్ ఓట్ల తొలగింపును నిష్పక్షపాతంగా, పారదర్శకంగా తొలగించాలని ప్రజలంతా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. వచ్చే నెల నుంచి షురూ కాబోతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధం అవుతోంది. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన లేకపోగా అనుమానాలు ఉన్నాయి. అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం, విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఫలితం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.
సర్ ప్రారంభానికి ముందే జూన్ 15 నుంచి 24వరకు సంబంధిత సిబ్బంది, అధికారులకు శిక్షణ, ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ ఏర్పాట్లు చేయనున్నారు. జూన్ 25 నుంచి జూలై 24వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, తిరిగి సేకరించే ప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 24లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేసి, జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28వరకు వాటి పరిష్కారం చేపట్టి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభానికి ముందే ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 మందికి మించకుండా ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జూన్ 25 నుంచి జూలై 24వరకు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో బోగస్ ఓట్లతో పాటు రెండు ప్రదేశాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారి వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ఒక కుటుంబంలోని సభ్యులు అందరి ఓట్లు ఒకే కేంద్రంలో పోలింగ్లో పాల్గొనేలా నమోదు చేయనున్నారు. బోగస్ ఓట్లను తొలగించనున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశానుసారం అన్ని అర్హతలు కలిగి ఉండి ఓటరు జాబితా నుంచి తొలగిస్తే సంబంధిత ఓటరు పై అధికారులకు అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటు చేసింది. 2002లో సమగ్ర సర్వే అనంతరం రూపొందించిన జాబితాతో పాటు 2025లో ఓటరు జాబితాలో నమోదైన వారి వివరాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి సవరణ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల అధికారులు(బీఎల్వో) ఈ ప్రక్రియను చేపడుతున్నారు. 39 ఏళ్లకు పైబడి 2002 జాబితాలో ఓటరు జాబితాలో ఓటరుగా నమోదైన వారు ఏ కేటగిరిలో, 39 సంవత్సరాల వయకు పైబడినా 2002 ఓటరు జాబితాలో పేరులేని వారి వివరాలను బీ కేటగిరీలో చేర్చుతున్నారు.
21 నుంచి 38 ఏళ్లలోపు వయసున్న వారిని సీ కేటగిరీలో, 18 నుంచి 20 ఏళ్ల వయసు ఉండి 2004 తర్వాత జన్మించిన వారి జాబితాను డీ కేటగిరీలో చేరుస్తున్నారు. ఉమ్మడి నిజామబాద్ జిల్లాలో రెండు జిల్లాల కలెక్టర్లు క్షేత్ర స్థాయి రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటి సర్వే చేపట్టేందుకు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. బీఎల్వోలు ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) విధులు నిర్వహించేందుకు సుముఖంగా లేనట్లుగా పేర్కొంటున్నారు. కొన్ని మండలాల్లో జీపీవోలకు బీఎల్వో బాధ్యతలు అప్పగించారు. ఇంటింటికీ బీఎల్వోలు తిరిగి వివరాలను సేకరిస్తారు. ఓటరు ఇంటికి తాళం వేసి ఉంటే అందుబాటులో లేకపోతే మొత్తం మూడు సార్లు సదరు ఇంటిని విజిట్ చేసే విధంగా నిబంధన పెట్టారు.