నందిపేట్, జూలై 17: తాళం వేసిన ఇండ్ల లో చోరీ చేసి.. ఆపై ఆధారాలు దొరక్కుండా కారం చల్లి వెళ్లిన ఘటన నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెల్మల్ గ్రామంలో తాళం వేసి ఉన్న రెండిండ్లలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. మార్కెట్ వీధిలో ఉండే ఆర్ఎంపీ బొడ్డు చంద్రశేఖర్ బంధువుల ఇంటికి వెళ్లగా.. గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.
10 తులాల బంగారం, రూ.10 లక్షల నగదును అపహరించారు. ఢీకంపల్లి రోడ్డులోని గొర్లపాటి ప్రవీణ్ ఇంటి తాళాలు పగులగొట్టి 10 తులాల బంగారం, రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బీరువా తాళాలు పగులగొట్టి అందులోని వస్తువులను చిందరవందర చేసి బంగారం, నగదును దోచుకెళ్లారు. చోరీ చేసిన అనంతరం పోలీసులకు ఆధారాలు లభించకుండా ఉండేందుకు దుండగులు కారం చల్లి వెళ్లారు.
మధ్యాహ్న సమయంలో తాళం వేసిన ఇండ్లను గుర్తించి రాత్రి వేళ్లలో పక్కా ప్రణాళికతో తాళాలు పగలగొట్టి బంగారు, నగదు అపహరణకు పాల్పడ్డారు. దుండగులు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా హెల్మెట్ ధరించడంతోపాటు ముసుగులు వేసుకొని చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాహుల్ తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.