బడా పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితపై కేసుల కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గ క్రైస్తవులకు గురువారం వేల్పూర్ మండల కేంద్రంలో క్రిస్మస్ గిఫ్టులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
-వేల్పూర్, డిసెంబర్ 22
వేల్పూర్,డిసెంబర్ 22 : తన దోస్తులైన పారిశ్రామిక వేత్తలకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేసి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై మోదీ సర్కారు కేసుల కుట్రలకు పాల్పడుతున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ,శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. బడా పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్ల మాఫీ చేయగా వచ్చిన లంచాల డబ్బులను బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాలను పడగొట్టేందుకు వాడుతున్నారని ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ గిప్టుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌తో కలిసి ముఖ్య అథితిగా పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నదని బీజేపీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌తో పోలిస్తే ఆరు రేట్ల ఎక్కువ డబ్బులను నరేంద్ర మోదీ వారి దోస్తుల కోసం మాఫీ చేశారని విమర్శించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల్లో ఒక్కో ఎమ్మెల్యేను వంద కోట్లు పెట్టి కొనడానికైనా దిగజారుతున్నారని విమర్శించారు. ఇటీవలే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయి అడ్డంగా దొరికిపోవడం అందరికీ తెలిసిందేనన్నారు.
రాష్ర్టాలపై బీజేపీ ప్రభుత్వం ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతుండడాన్ని మొదటి నుంచి కేసీఆర్ నిలదీస్తూ ఎదురొడ్డి కొట్లాడుతున్నారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని మోదీ ప్రభుత్వం ఈడీ, జైలు, సీబీఐ, కేసులు తదితర కుట్రలు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే కవితపై కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే సీబీఐని కవిత ఇంటికి పంపారని ఆరోపించారు. ఇలాంటి కేసుల కుట్రలకు భయపడేది లేదన్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. రాజీలేని పోరాటం కొనసాగుతుందని.. మోదీ మెడలు వంచే దాకా కేసీఆర్ విశ్రమించబోరని స్పష్టం చేశారు.
కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలన్నారు. సుభిక్షంగా, పంటలు, సాగునీటి ప్రాజెక్టులు, జనరంజక పాలన, సర్వమత సామరస్యతతో సంతోషంగా ఉన్న రాష్ర్టాన్ని చూసి బీజేపీకి కడుపు మంటగా ఉందన్నారు. అందుకే తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులను కేంద్రంలోని బీజేపీ అడ్డుకుంటుదన్నారు. ప్రాజెక్టులతో ధాన్యం దిగుబడులు పెరిగిన తెలంగాణలో ధాన్యం ఆరబెట్టుకునే కల్లాలకు డబ్బులు ఇవ్వబోమని కేంద్రం దిగజారి చెబుతుండడం సిగ్గుచేటన్నారు. రైతుల కల్లాల డబ్బులు వాపస్ అడుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా అవసరమా అనేది ఆలోచించాలని రైతులను కోరారు. దేశంలో 54 మెడికల్ కాలేజీలు,16 ఐఐటీలు, 28 కేంద్రీయ విద్యాలయాలు మంజూరైతే వీటిలో రాష్ర్టానికి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం తెలంగాణపై మోదీ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు నిదర్శనం అన్నారు.
దేశాన్ని బీజేపీ సర్కారు దోపిడీ చేస్తుండడాన్ని అడ్డుకునేందుకే బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ జాతీయ స్థాయిలో పోరాటాలకు బయలుదేరారన్నారు. ఈ సమయంలో కేసీఆర్‌కు అండగా తెలంగాణ ప్రజలు నిలబడాల్సిన అవసరముందన్నారు. ప్రధాని మోదీ ఫ్రీ కరెంటు వద్దు కరెంట్ మోటర్లకు మీటర్లు ముద్దంటున్నారని గుర్తు చేశారు. ఇలాంటి బీజేపీకి రైతన్నలు ఎందుకు మద్దతియ్యాలని ప్రశ్నించారు. యూపీతో పాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నియోజకవర్గానికి ఒకటి రెండు చోట్ల మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు. ఆరు నెలలకు ఒకసారి గాని డబ్బులు రావన్నారు. అదే తెలంగాణలో కేసీఆర్ ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు వారం రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నారన్నారు.క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపే సాహసం దేశంలో ఎవరూ చేయలేదని ఒక కేసీఆర్ మాత్రమే సర్వమత సమానత్వ లక్ష్యంతో ఆ సాహసం చేశారని తెలిపారు.
సంకుచిత మనస్తత్వంతో దేశాన్ని పెంచి పోషించే వారిని ఏ దేవుడూ క్షమించడన్నారు. అలాంటి వారికి ప్రజల వద్ద స్థానం ఉండబోదన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో చర్చిల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు గిఫ్ట్‌లను పంపిణీ చేశారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.