– నిందితులను కాపాడేందుకే పోలీసుల ఎత్తుగడ
– ఎస్సీ కమిషన్ నోటీసులు ఇచ్చేదాకా కదలని పోలీసు యంత్రాంగం
– నివేదికను బట్టే తదుపరి కార్యాచరణ
– రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించే తీరికలేని మంత్రి ఉత్తమ్
– పూర్తి న్యాయం జరిగేంత వరకు ఎమ్మార్పీఎస్ ఉద్యమం
కోదాడ, ఫిబ్రవరి 27 : పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కర్ల రాజేశ్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు ఆలస్యం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులచే రాజేశ్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజేశ్ మరణించిన వారం రోజులు లోపే రీపోస్టు మార్టం చేసినట్లయితే మృతికి గల కారణాలు స్పష్టంగా తెలిసేవన్నారు. కాలం గడిచే కొద్దీ మృతదేహం కుళ్లిపోయి ఒంటిపై ఉన్న గాయాలు కనపడకుండా పోతాయనే దురుద్దేశంతోనే వంద రోజులపాటు కాలయాపన చేశారని విమర్శించారు. జాతీయ ఎస్సీ కమిషన్ వంద రోజుల క్రితమే రీ పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం బేకాతరు చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కమిషన్ నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు పోలీసులు హడావిడిగా పోస్టుమార్టం నిర్వహించారని, ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నారో పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నిందితులకు కొమ్ము కాయడానికేనని దుయ్యబట్టారు. పోలీసు అధికారుల కుట్రలు బహిర్గతం చేస్తామని, నివేదికలో కేవలం వాస్తవాలు మాత్రమే స్పష్టీకరించాలని, దానిని కూడా ప్రభావితం చేసేందుకు చూస్తే మాత్రం అన్ని ఆధారాలతో వారి కుట్రను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులు అందించే నివేదికను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. రాజేశ్ కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. వారానికి రెండు విడతలు కోదాడ, హుజూర్నగర్ కు కలియతిరిగే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తూ చిలుకూరు ఎస్ఐ సురేశ్‌ని కాపాడేందుకేనన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్ట పరంగానే రాజేశ్ తల్లికి ఉద్యోగం, పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని అవి తమ ప్రభుత్వమే మంజూరు చేసిందని మంత్రి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏపూరి రాజు, కొండపల్లి ఆంజనేయులు, నరేశ్ మాదిగ పాల్గొన్నారు.