ఖలీల్వాడి/కామారెడ్డి, ఆగస్టు 10: ఉమ్మడి జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)కు సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిన గడువు సోమవారంతో ముగిసింది. కామారెడ్డి జిల్లాలో 87.87 శాతం దరఖాస్తుల స్వీకరణ/ఓటర్ నమోదు పూర్తి కాగా, నిజామాబాద్లో 85.28 శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 796 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 6,96,006 మంది ఓటర్లకు గాను, 6,11,568 మంది (87.87 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. మిగిలిన 84,438 ఫారాలను ధ్రువీకరణ కానివిగా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 14,39, 734 మందికి గాను 12,27,870 మంది (85.28 శాతం) సంబంధించి డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో ఓటర్ జాబితా సవరణను చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిత గడువును రెండుసార్లు పొడిగించింది. వాస్తవానికి గత నెల 24వ తేదీలోపే సర్ పూర్తి చేయాలని భావించినప్పటికీ కుదర లేదు. ఎన్యూమ రేషన్ ఫారాల పంపిణీ, ఆన్లైన్లో నమోదు ప్రక్రియ అనుకున్నంత వేగవంతంగా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే రెండు విడు తల్లో కలిపి ఈ నెల 10 వరకు గడువు పెంచారు. సోమవారంతో ఆ గడువు ముగిసి పోగా, ఓటర్ల నమోదుకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రకటించారు.
‘సర్’లో ఉభయ జిల్లాలు వెనుకబడ్డాయి. వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లినప్పటికీ టార్గెట్ చేరుకోలేదు. కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానానికి పరిమితం కాగా, నిజామాబాద్ కూడా వెనుకబడి పోయింది. చాలా మంది ఓటర్లకు సర్పై అవగాహన లేకపోవడం, కొంత మంది బీఎల్వోలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇక, ఓటర్లకు ఫారాలు నింపడం రాక, 2002 నాటి సర్ వివరాలు దొరకక పోవడం కూడా మరో కారణంగా పేర్కొంటున్నారు. మరోవైపు, కొన్నిచోట్ల సర్ ప్రక్రియపై పలు ఆరోపణలు వచ్చాయి. కొందరు ప్రజాప్రతినిధులు బీఎల్వోలను తమ వద్దకే పిలిపించుకుని తూతూ మంత్రంగా ఓటర్ నమోదు పూర్తి చేశారన్న ఆరోపణలు వినిపించాయి.
ఉభయ జిల్లాల్లో సర్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. డిజిటలైజేషన్ పూర్తయిన తరుణంలో ఈ నెల 17వ తేదీన ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం అక్టోబర్ 19వ తేదీన తుది జాబితా ప్రచురించనున్నారు. కామారెడ్డి జిల్లాలో 6,96,006 మంది ఓటర్లకు గాను 6,11,568 మంది ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు చేశారు. మిగిలిన 84,438 మంది ధ్రువీకరణ కానివిగా పేర్కొన్నారు. ఇందులో చనిపోయిన వారు, శాశ్వతంగా ఇల్లు మారిన వారు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు.