కంఠేశ్వర్, ఆగస్టు 13 :రానున్న రెండు రోజుల పాటు జి ల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, తండాల్లో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడా కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముం దస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని సూచించారు.
అత్యవసర పరిస్థితి దృష్ట్యా సెలవులను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. అత్యవసరమైతే ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలని కలెక్టర్ హితవు పలికారు. నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ పట్టణాల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తే సమయాల్లో చేపట్టే సహాయక చర్యలపై ప్రజలకు భరోసా కల్పించేలా ఆయా వార్డుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు.
లోతట్టు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వద్దకు ప్రజలు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేపల వేట, ఈత కోసం చెరువులు, కాలువలు, రిజర్వాయర్లలోకి దిగకుండా కట్టడి చేయాలని, అవసరమైన చోట పోలీసు బందోబస్తు పికెటింగ్ ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేస్తూ భారీ వర్షాలతో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.