కామారెడ్డి రూరల్ , జూన్ 18 : ఇంట్లో గొడవలతో తండ్రిని చితకబాదుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా కనిపించిన ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఆమెను దారుణంగా హతమార్చాడు. కామారెడ్డి జిల్లా తిమ్మక్‌పల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దేవునిపల్లి ఎస్సై రాజు, బాధితుల కథనం ప్రకారం.. తిమ్మక్‌పల్లిలో రాగుల లక్ష్మి (80), రాగుల రాజశేఖర్ కుటుంబాలు పక్కపక్కనే నివాసముంటున్నాయి. రెండు కుటుంబాల మధ్య గతంలో గొడవలు జరిగాయి. అయితే, సోమవారం సాయంత్రం తన తండ్రితో గొడవ పడిన రాజశేఖర్ ఆయనను చితకబాదుతూ బయటికి లాక్కొచ్చాడు. అదే సమయంలో రోడ్డు మీదుగా వెళ్తున్న లక్ష్మి కనిపించడంతో తండ్రిని వదిలిపెట్టిన రాజశేఖర్ ఆమెపై దాడికి దిగాడు. ఇటుక పెల్లలతో తలపై, చెవిపై బలంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెతో ఉన్న మనువడిపైనా దాడికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు లక్ష్మిని హుటాహుటిన కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. తన తల్లిపై దాడి చేసి చంపిన రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుమారుడు పెద్ద నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.