బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 4 : గురుకుల పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గురుకుల బాట’కు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో గురుకుల బాట కమిటీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన గురుకుల బాట ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్, బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మండలంలోని కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పాఠశాల గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. వారిని పాఠశాల లోపలికి వెళ్లకుండా అరెస్టు చేసి బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తే .. వాటిని నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను తెలుసుకొని, అందులో ఉన్న లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటను అడ్డుకోవడం సీఎం చేతకానితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం ఎన్ని కుట్రలు చేసి బీఆర్ఎస్ పార్టీని అడ్డుకున్నా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోచి గణేశ్, సబ్బని హరీశ్, శివసూరి, మన్నె అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి సబ్బని హరీశ్ ఆధ్వర్యంలో సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అందిస్తున్న భోజనం సరిగ్గా లేదని విద్యార్థులు తెలిపారు. మెనూ ప్రకారం గుడ్లు, చికెన్ అందించడం లేదన్నారు. అనంతరం పక్కనే ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలకు వెళ్లగా.. ప్రిన్సిపాల్ రఫత్ అడ్డుకొని వాగ్వాదానికి దిగాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరిని మాత్రమే అనుమతించడంతో సబ్బని హరీశ్, ఆదిమూలం సతీశ్‌కుమార్ పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు నాగం సురేందర్, అరవింద్‌గౌడ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.