మెండోరా/ముప్కాల్, అక్టోబర్ 27 : ఎన్నికలు రాగానే కొందరు ఊళ్లమీద పడి లేనిపోని ఆరోపణలు, మభ్యపెట్టే హామీలు గుప్పిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచించారు. సంక్షేమం కోసం కేసీఆర్ ఆరాటపడుతుంటే అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీలు వెంపర్లాడుతున్నాయని మండిపడ్డారు. పుట్టిన బిడ్డ.. తల్లి ఒడిలో పదిలంగా ఉన్నట్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ పాలనతో పదిలంగా ఉన్నదని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్, మెండోరా మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని శుక్రవారం ఆయా మండలాల్లో నిర్వహించగా, రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డితో కలిసి మంత్రి హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన బలం, బలగం కార్యకర్తలేనని, తన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనన్నారు. రెండు మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే 90శాతం ఓట్లు కారు గుర్తు వచ్చినట్లేనన్నారు.
ప్రతి కార్యకర్త కథనాయకుడి పాత్ర పోషించాలన్నారు. బీఆర్ఎస్ సైనికులు ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారుల ఓటు అడగాలని పిలుపునిచ్చారు. అన్నపూర్ణమ్మ అంటే తనకు అపార గౌరవముండేదని, కానీ కొడుకులాంటి వాన్ని అని కూడా చూడకుండా పదవి కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వయస్సు, స్థాయిని మరిచి దిగజారి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నదన్నారు. గంజాయిని అరికట్టిన తనపై నిందలు వేయడం తగునా అని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. అప్పుడు ఏమీ చేయనోళ్లు ఇప్పుడు వచ్చి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చేసిన వారెవరో ప్రజలే ఆలోచన చేసి ఆశీర్వదించాలన్నారు. ముప్కాల్, మెండోరాను మండలాలుగా ఏర్పా టు చేసుకొని రూ. వందల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామన్నారు.
సెంట్రల్ లైటింగ్, రోడ్లు, ప్రార్థనా మందిరాలు, కులసంఘ భవనాలు నిర్మించామన్నారు. పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులే 90 శాతం ఉన్నారని, వారు ఓటేసినా భారీ మెజారిటీ వస్తుందన్నారు. కార్యకర్తలు ఆ స్థాయిలో పని చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో ఏమీ చేయరు కానీ, తెలంగాణలో మాత్రం అన్నీ ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 60 ఏండ్లు అరిగోసపెట్టి నేడు గ్యారంటీల పేరుతో వస్తున్న కాంగ్రెస్‌ను నమ్మొద్దన్నారు. రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్.. తన వైఖరిని బయట పెట్టుకుంటున్నదని, ఆ పార్టీతో రైతులకు కరెంటు కటకటే అన్నారు. ఓట్లు వేసిన పాపానికి కర్ణాటక రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని గుర్తుచేశారు. సమావేశంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.