కామారెడ్డి/బాన్సువాడ/వేల్పూర్, ఏప్రిల్ 5: కష్ట కాలంలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతోపాటు వడగండ్లు, అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నది. వడ్లకు రూ.500 బోనస్, నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు నేడు (శనివారం) రైతుదీక్షలు నిర్వహించనున్నది.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉదయం 10.30 గంటలకు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో రైతుకు మద్దతుగా దీక్ష చేపడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ శుక్రవారం తెలిపారు. బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రైతుదీక్ష ప్రారంభిస్తామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్‌రెడ్డి తెలిపారు. వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు మద్దతు దీక్ష చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు రేగుల్ల రాములు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షలను విజయవంతం చేయాలని వారు కోరారు.