ఖలీల్‌వాడి, మార్చి 21:హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసగించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. బడ్జెట్లో బీసీలకు, ఎస్సీలకు సరైన కేటాయింపులు చేయలేదని ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నీలగిరి రాజు విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి రెండున్నరేండ్లు కాలయాపన చేశారు తప్పితే నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి జల్సాల కోసం ఫుట్‌బాల్ టోర్నమెంట్, గాంధీ విగ్రహ ఏర్పాటు, ఢిల్లీ టూర్ల కోసం రూ.కోట్లు వృథా చేస్తున్నారని, పేదల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలను అడ్డు పెట్టుకుని ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారని, ఓటమి భయంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేశారన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో పేదలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాపాలన పేరుతో మూడుసార్లు దరఖాస్తులు తీసుకున్నారని, వాటి అతీగతీ ఏమైందో ఎవరికీ తెలియదన్నారు. ఎస్సీలకు రుణాలు లేవు, పథకాలు లేవు, దళితబంధు ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీలకు అతిపెద్ద ద్రోహం చేశారని మండిపడ్డారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అన్ని వర్గాలకు మళ్లీ సంక్షేమ పథకాలు అందుతాయని, కుంటుపడ్డ కుల వృత్తులకు మళ్లీ వెలుగులు వస్తాయన్నారు. బీఆర్ఎస్ నేతలు సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, బీసీ సెల్ అధ్యక్షుడు గాండ్ల లింగం, జమలాపూర్ రమేశ్, చింతకాయల రాజు, మాకు రవి, నరేశ్ గౌడ్, బగ్గాలి అజయ్, అగ్గు సంతోష్, సుధాకర్ పాల్గొన్నారు.