ఖలీల్‌వాడి, మే 9: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన తరుణంలో నైతిక బాధ్యతగా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే ప్రధాని మోదీ బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆర్మూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదని మరోసారి రుజువైందని, దశరథ మహారాజు, రాముడు లాంటి కేసీఆర్, కేటీఆర్‌పై మీరు మాట్లాడిన మాటలకు ఇప్పుడు ముకుతాడు పడిందన్నారు.
బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదైందని, ఆర్ఎస్ బ్రదర్స్ (రేవంత్‌రెడ్డి, సంజయ్) కేసు నమోదు కాకుండా దాదాపు 8 గంటలు యత్నించారని తెలిపారు. అయితే, కేసు పెట్టకుంటే చనిపోతానని బాధితురాలు చెప్పడంతో చివరకు కేసు నమోదు చేశారన్నారు. కేసు నమోదుపై జాతీయ కాంగ్రెస్ పార్టీ స్పందించిందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఇప్పటివరకూ దీనిపై స్పందించలేదని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ నడుమ ఫెవికాల్ బంధానికి ఇదే నిదర్శనమన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. లేకపోతే రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.