కోదాడ, ఆగస్టు 03 : కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ నేతృత్వంలో ప్రత్యేక నిఘా టీం ఆదివారం సాయంత్రం కోదాడ పట్టణ పరిధిలోని డేగ బాబు కల్యాణ మండపం సమీపంలో నిందితుల నుండి 6 కేజీల గంజాయి, 38 బాటిళ్ల దగ్గు మందును స్వాధీనం చేసుకుంది. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. కోదాడ పట్టణానికి చెందిన పంది వినోద్, షేక్ మగ్దుం పాషా, ఆవిడి రాఘవలు, అనంతగిరి మండలానికి చెందిన రవితేజ, షేక్ ఇర్బాన్లతో పాటు ఖమ్మం పట్టణానికి చెందిన షేక్ సుభానిలను పట్టణ సీఐ నేతృత్వంలో ప్రత్యేక టీం దాడి నిర్వహించి పట్టుకుని వారి నుండి 6 కేజీల గంజాయి 38 దగ్గు మందు బాటిళ్లు, ఒక బైక్‌ను రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రవితేజ ఒడిశా నుండి గంజాయి కొనుగోలు చేసి కోదాడకు తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నాడు. అతడి ద్వారా ఇతర నిందితులు కొనుగోలు చేసుకుని విక్రయిస్తున్నారు. దీంతోపాటు ఖమ్మం పట్టణంలో మెడికల్ జనరల్ స్టోర్ యజమాని సుభాని ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందు విక్రయిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక నిఘా టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన నిందితులు యువత, విద్యార్థులు టార్గెట్ గా, వారితో పాటు ఆటో డ్రైవర్లకు గంజాయి సరఫరా చేసి సంఘ విద్రోహక చర్యలకు పురి కోల్పోతున్నారన్నారు. ఈ దాడిలో ముగ్గురు బాల నేరస్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. గంజాయి సరఫరాకు పాల్పడ్డ మరికొందరిని త్వరలో గుర్తించి అరెస్టు చేయనున్నట్టు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రజలు సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు, పోలీస్ అధికారులకు తెలియజేయాలని డీఎస్పీ కోరారు. ఈ కేసును చేధించిన పట్టణ సీఐ శివశంకర్, ఎస్ఐ అజయ్ కుమార్, ఇతర పోలీసులకు రివార్డుకు ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు.