నవీపేట, డిసెంబర్ 5: బీఆర్ఎస్ నాయకులు ఏమాత్రం అధైర్యపడొద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. కలిసి కట్టుగా పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నవీపేట మండల అధ్యక్షుడు వి.నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గురువారం హైదరాబాద్‌కు వెళ్లి కవితను కలిశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేక మోసగించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, నేతలు అబ్బన్న, పోశెట్టి, ప్రవీణ్‌కుమార్, రమేశ్, సురేశ్, గొట్టిరాజు, స్వామి, జనార్దన్, రాములు, సూరిబాబు, రవీందర్‌రెడ్డి, సాయికుమార్‌గౌడ్, మహిపాల్, శ్రీనివాస్, లక్ష్మణ్, శ్యామ్ తదితరులు కవితను కలిసిన వారిలో ఉన్నారు.