Banswada | బాన్సువాడ, జులై 14 : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల మాతాశిశు ఆసుపత్రి లో ఐదుగురు మహిళలకు శస్ర్త చికిత్సలు జరిగిన అనంతరం తీవ్ర అస్వస్తతకు గురి కావడం పట్ల బీఆర్ఎస్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఖలీల్ మాటాడుతూ వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. గతంలో ఉన్నట్లు ఆసుపత్రి లేదని, ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందించడం లేదని, విధులు నిర్వహించే వైద్యులు వారి వారి ప్రవేట్ ఆసుపత్రులను నడిపిస్తూ ఒంటిగంట తరువాత ఆసుపత్రిలో ఉండడం లేదని ఆయన మండిపడ్డారు.
ఆసుపత్రి లో మౌలిక వసతులు సరిగా లేవని, మరుగుదొడ్లు వెళ్లేవారికి సరిగా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిజేరియన్ వికటించిన బాధిత మహిళ పాతిమాకు రెండు సార్లు కిడ్నీ వాపు వచ్చిందని తెలిపారు. రక్త స్రావం ఎక్కువవుతుందని తెలిసినా రక్తం ఎక్కించకుండా ఇబ్బందులకు గురిచేశారని ఖలీల్ ఆరోపించారు. అస్వస్థతకు గురైన వారందరికీ మెరుగైన వైద్యం అందించేలా సూపరిండెంట్ చర్యలు చేపట్టాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ దుద్ధాల అంజిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మక్బూల్, మాజీ వార్డు సభ్యుడు శ్రీనివాస్, అక్బర్, రమేష్ యాదవ్, చాకలి సాయిలు, మోచి గణేష్, శివ సూరి, ఫిరోజ్, రహీం తదితరులు పాల్గొన్నారు.