నిజామాబాద్, సెప్టెంబర్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులకు మేలు చేయాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై రాజకీయ పడగ బుసలు కొడుతోంది. పదవీ కాలం పొడిగింపు అంశంలో బీఆర్ఎస్ నేతలకు ఒక విధంగా, అధికార పార్టీ నేతలు మరో రకంగా అన్నట్లుగా అధికారుల తీరు మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పదుల సంఖ్యలో సొసైటీలకు పదవీ కాలం నిలిపేశారు. ఇక్కడ పర్సన్ ఇన్ఛార్జీల పేరిట ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పీఏసీఎస్ పరిపాలనను అప్పగించారు. వాస్తవానికి 2025, ఫిబ్రవరి 14తో సొసైటీ పాలకవర్గాలకు పదవీ కాలం ముగిసింది.
ప్రభుత్వం ఆరు నెలల పాటు పొడిగించడంతో ఆగస్టు 14తో ముగుస్తుండటంతో మరో 6 నెలలకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలో పేర్కొన్న పనితీరు అనే నిబంధనను సాకుగా చూపి రాజీకయ దురుద్ధేశంతో పదవీ కాలం వర్తింపును సొసైటీలకు వర్తింపజేస్తుండటం వివాదాస్పదం అవుతోంది. గులాబీ పార్టీలో కొనసాగుతూ కో-ఆపరేటివ్ సొసైటీలకు బాధ్యత వహిస్తున్న కారణంతోనే కొంత మందిని పక్కన పెట్టినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పీఏసీఎస్ పనితీరు ఆధారంగానే పదవీ కాలం పొడిగింపును వర్తింప జేస్తున్నట్లుగా అధికారికంగా చెబుతున్నప్పటికీ పలు సొసైటీల్లో లోటుపాట్లు ఉన్నప్పటికీ కనీసం పట్టించుకోకపోవడం వివాదాస్పదం అవుతోంది. అధికార పార్టీకి చెందిన కీలక నేతలు స్వయంగా రంగంలోకి దిగి తమకు నచ్చిన వారికి పదవీ కాలం పొడిగించి వేరే పార్టీలకు చెందిన వారికి మొండి చేయి చూపిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
స్థానిక ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని ఒత్తిడి…?
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పాలక వర్గాలకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఎన్నికలు సైతం రాజీయ పార్టీ గుర్తులపై జరగదు. అయినప్పటికీ అధికార పార్టీ ఈ రకమైన ప్రయత్నాలకు పాల్పడుతుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనితీరు సాగుతో నిబంధనను అడ్డు పెట్టుకుని 12 అంశాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో లోపాలు బహిర్గతమైతే వాటినే ప్రధానంగా ఎత్తి చూపి పదవీ కాలం పొడిగింపును అడ్డుకుంటున్నారు.
సొసైటీలకు ఛైర్మన్లుగా బీఆర్ఎస్ నేతలున్న చోట మాత్రమే తప్పులు బయట పెట్టడమే విస్మయానికి గురి చేస్తోంది. సమీప భవిష్యత్తులో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి పరోక్షంగా సహకరించాలనే ఒప్పందం లేదంటే తమ పార్టీ కండువా కప్పుకోవాలనే షరతుతోనే చాలా చోట్ల పీఏసీఎస్ ఛైర్మన్లకు ఫోన్లు, మధ్యవర్తుల ద్వారా సమాచారం చేర వేశారు. అధికార పార్టీకి మద్ధతుగా నిలిస్తే ఎలాంటి తప్పులను ఎత్తి చూపడం లేదు.
అవినీతి, ఆరోపణలకు కేరాఫ్‌గా నిలిచిన సొసైటీల్లో, ఫిర్యాదులు వచ్చి విచారణ పెండింగ్‌లో ఉన్న సంఘాలకు పలు చోట్ల పదవీ కాలం పొడిగించారు. ప్రభుత్వం చేస్తోన్న ఈ అన్యాయంపై న్యాయ పరంగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధం అవుతున్నారు. తమ పదవీ కాలాన్ని కుట్రపూరితంగా పొడిగించకపోవడంపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. చట్ట ప్రకారం దక్కాల్సిన పదవీ కాలాన్ని తప్పనిసరిగా సాధించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. పోతంగల్ సొసైటీ విషయంలో ఇతరత్రా కారణాలుండగా 88 చోట్ల పాలకవర్గాలున్నాయి. వీరిలో ప్రస్తుతం 60 సొసైటీలకు సంబంధించి పాలకవర్గాలను కొనసాగిస్తూ జిల్లా సహకార అధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మిగిలిన 28 సొసైటీల్లో 18 చోట్ల పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 10 సొసైటీలపై విచారణ చేస్తున్నారు.
లోటుపాట్లు ఉంటే ఇక్కడ కూడా పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తామని అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 55 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇక్కడ కూడా ఇప్పటి వరకు 18 సొసైటీలకు పదవీ కాలం పొడిగింపు ఇవ్వడంలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీ నేతల కనుసన్నల్లోనే పదవీ కాలాన్ని పొడిగించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఉన్న చోట మాత్రమే రాద్దాంతం జరుగుతుండటం విడ్డూరంగా మారింది.
పీఏసీఎస్ ఛైర్మన్లుగా ఉన్న వారికి నేరుగా అధికార పార్టీ ముఖ్య నేతల నుంచి ఫోన్లు పోతున్నాయి. కండువా మార్చితేనే పదవీ కాలం ఉంటుందని నేరుగా అడుగుతున్నారు. అందుకు ఒప్పుకోకపోతే పదవీ కాలం ఇచ్చేందుకు అడ్డు పడుతున్నట్లుగా గులాబీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నుంచి కుట్రలు జరుగుతున్నప్పటికీ కరుడు గట్టిన బీఆర్ఎస్ నేతలు మాత్రం కండువా మార్చేందుకు మాత్రం ఒప్పుకోకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం పదవీ కాలం పొడిగింపు ప్రక్రియను చేపడుతున్నాము. నిజామాబాద్ జిల్లాలో 18 సంఘాలకు నిలుపుదల చేసి పర్సన్ ఇన్చార్జీలను నియమించాము. 10 చోట్ల విచారణ సాగుతోంది. పనితీరు బాగోలేక పోవడం వల్లే పర్సన్ ఇన్చార్జీలను నియమించాల్సి వచ్చింది.
– శ్రీనివాస్ రావు, సహకార శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా