కాంగ్రెస్ పాలనలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది. ఎక్కడికక్కడ నిర్బంధకాండ కొనసాగుతున్నది. పేరేమో ప్రజా పాలన.. తీరేమో నియంతృత్వ పాలన. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన అరెస్టుల పర్వమే అందుకు నిలువెత్తు నిదర్శనం. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పోలీసులు జులుం ప్రదర్శించారు. అర్ధరాత్రి వేళ ఇండ్లను ముట్టడించి గులాబీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.
తెల్లారాక కూడా కనిపించిన వారిని కనిపించినట్లు అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. సొంత పనుల మీద బయటికి వెళ్లే వారిని సైతం నిర్బంధించారు. హైదరాబాద్‌కు వెళ్లట్లేదు మొర్రో అన్నా వినకుండా పోలీసుస్టేషన్లకు తీసుకెళ్లి పొద్దంతా కూర్చోబెట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నేతలపై బల ప్రయోగం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.
-నిజామాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేల విషయంలో సైబరాబాద్ పోలీసులు ప్రవర్తించిన అనుచిత వైఖరిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేసి గంటల తరబడి వాహనాల్లో తిప్పిన ఘటనపై గులాబీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇందులో భాగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తరలి రావాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి గులాబీ నేతలంతా శుక్రవారం కదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రతిపక్ష పార్టీ నేతల గొంతు నొక్కే విధంగా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. గురువారం అర్ధరాత్రి వేళ మొదలైన అరెస్టుల పర్వం శుక్రవారం పొద్దంతా కొనసాగింది.
స్వరాష్ట్ర ఉద్యమాన్ని అణిచి వేసేందుకు పోలీసులను అడ్డు పెట్టుకుని నాటి ఆంధ్రా పాలకులు చేసిన క్రూరమైన చర్యల మాదిరిగానే రేవంత్‌రెడ్డి ప్రభు త్వం వ్యవహరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉద్యమ జ్వాలను రగిలించి రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ విధించే నిర్బంధాలు ఏమీ చేయలేవని గులాబీ నేతలు చెబుతున్నారు. కనీస నియమ, నిబంధనలను పాటించకుండా బీఆర్ఎస్ లీడర్లను ఇంటికొచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లడంపై వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా ప్రవర్తించడం సరికాదంటూ మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్.. ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలని చూస్తుండడం సిగ్గుచేటంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తటస్థంగా ఉంటూ ప్రజల రక్షణకు పని చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ మాజీ మంత్రులు వేముల, హరీశ్‌రావులను అరెస్టు చేయడంపై బాల్కొండ నియోజకవర్గ నేతలు ఖండించారు.