హామీల అమలుపై అడుగడుగునా నిలదీతలు.. ప్రజా సమస్యలపై పదే పదే ప్రశ్నాస్ర్తాలు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు.. పాలనలో ఘోర వైఫల్యం చెందిన రేవంత్ సర్కారు గులాబీ పార్టీపై కక్ష గట్టింది. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేసే చేతకాని ప్రభుత్వం ప్రశ్నించే గొంతును నొక్కుతున్నది.
అక్రమ కేసులు పెట్టి లోపలేయడమే.. అసెంబ్లీలో నిలదీస్తున్న ఎమ్మెల్యేలను సభ నుంచి గెంటేస్తున్నది. అందులో భాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు అసెంబ్లీ నుంచి అక్రమంగా సస్పెన్షన్ వేటు వేసింది. సర్కారు తీరును నిరసిస్తూ గులాబీ శ్రేణులు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. రేవంత్ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశాయి. అక్రమ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 14: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై బడ్జెట్ సమావేశాల సెషన్ నుంచి సస్పెన్షన్ వేటు వేయడంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు ఎల్లారెడ్డి, కమ్మర్పల్లి, వేల్పూర్, ఆర్మూర్, నందిపేట్, డిచ్పల్లి తదితర మండల కేంద్రాల్లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కా ర్యర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నందిపేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు పా ల్గొని మాట్లాడారు. జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని, ఇది సీఎం రేవంత్‌రెడ్డి దురంహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. త్వరలోనే సీఎం తగిన మూల్యం చెల్లించుకోకపోతప్పదని హెచ్చరించారు. కామారెడ్డిపట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేయగా.. పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీలను అమలుచేసే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాపాలన పేరిట ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. జగదీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి ప్రాంగణం వద్ద ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డిది కక్షపూరితమైన పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని కుట్రపన్ని ఏకపక్షంతో సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ…తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై సీఎం స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇచ్చన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి బహిష్కరించడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనబెట్టి, ప్రశ్నిస్తున్న గొంతుకలను సస్పెండ్ చేస్తున్నదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలుచేయకుండా, ప్రజా సమస్యలను పరిష్కరించుకుండా పక్కదారి పట్టించడానికి ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై విధించిన అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించేందుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అలవికాని వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. ఏడాది కాలంగా ప్ర భుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు అడిగితే మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే ఆయనను శాసనసభలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు.