రామారెడ్డి(సదాశివనగర్), నవంబర్ 21: సన్మానం అనుకొని కారు దిగిన మంత్రి సీతక్క.. రైతుల సమస్యలు చెప్పగానే కారెక్కి వెళ్లిపోయి.. రైతులపై కేసులు పెట్టించడం తగదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సదాశివనగర్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కష్టపడి పండించిన సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే.. వారితో దురుసుగా ప్రవర్తించారని అన్నారు. కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. రైతులు తాగి వచ్చి తన కారును ఆపారని మంత్రి ఆరోపించారన్నారు.
అధికారం ఉన్నదని రైతులపై పోలీసులతో కేసులు పెట్టించడం తగదన్నారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సదాశివనగర్ మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ అనుముల రాజయ్య, బీసీ జిల్లా నాయకుడు కలాలీ సాయాగౌడ్, బీఆర్ఎస్ అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ అధ్యక్షుడు చాకలి లింగం, నాయకులు శివదీనం, ఆస మహేశ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నర్సారెడ్డి, బాల్‌రాజు, బాలయ్య, శ్రీనివాస్, బీరయ్య, రాజలింగం, యూనూస్ పాల్గొన్నారు.