నిజామాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకు పోతున్నది. అభ్యర్థుల ఖరారు నుంచి మొదలు ప్రచారపర్వం దాకా మిగతా పార్టీలకు అందనంత స్పీడ్‌లో ‘కారు’ దూసుకెళ్తున్నది. మరోవైపు, కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా వెనుకబడ్డాయి. రెండు పార్టీల్లోనూ పూర్తిగా స్తబ్ధత నెలకొంది. అభ్యర్థుల ఖరారులో బీఆర్ఎస్ ముందుంటే, హస్తం, కమలం పార్టీలు తీవ్ర జాప్యం చేశాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీకి మరోసారి చాన్స్ ఇవ్వగా, కాంగ్రెస్ అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత జీవన్‌రెడ్డి పేరును ప్రకటించింది.
ఒకవైపు గులాబీ శ్రేణులు ప్రచారంలో దూసు కెళ్తుంటే, ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఇంకా ఎన్నికల గోదాలోకే దిగలేదు. ఎంపీ అర్వింద్‌కు టికెట్ ఇవ్వడంతో బీజేపీలో అసంతృప్తి రెట్టింపయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్వింద్ కోసం పనిచేసేది లేదంటూ సొంత పార్టీ నేతలే ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించడంతో జిల్లా నేతలంతా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అభ్యర్థి విషయంలో జరిగిన ఆలస్యం పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా గులాబీ పార్టీ రెడీ అవుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలను రచిస్తున్నది షెడ్యూల్‌కు ముందే జహీరాబాద్‌కు గాలి అనిల్‌కుమార్, నిజామాబాద్‌కు బాజిరెడ్డి గోవర్ధన్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇరువురు నేతలూ ఇప్పటికే బరిలో దిగారు. శ్రేణులతో సమాయత్తమవుతూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతూ గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్నారు.
కేసీఆర్ ఆదేశాలతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లా నేతలను సమన్వయం చేసుకుంటూ నిజామాబాద్, జహీరాబాద్ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ, కాంగ్రెస్ ద్వంద నీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన మేలును గుర్తుచేస్తూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతోపాటు కరెంటు కటకట, సాగునీటి కొరత, పంటలకు దక్కని భరోసా, రుణమాఫీ దాటవేత, బోనస్‌పై బోగస్ ప్రకటనలను అస్ర్తాలుగా మలచుకుని కాంగ్రెస్, బీజేపీల తీరును ఎండగడుతున్నారు. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే వాటిని అంతర్గతంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని నిశ్చయించారు. జహీరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు నిజామాబాద్ లోక్‌సభ సీటును సైతం కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్తున్నారు.
నిజామాబాద్, జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, గాలి అనిల్‌కుమార్ ప్రచారంలో జోరు పెంచారు. లోక్‌సభ పరిధిలోని నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల సహకారంతో శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. అసంతృప్తి నేతలను సముదాయిస్తూ ముందుకు సాగుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ఆయా మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇక, జహీరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పత్తా లేకుండా పోయారు. నిజామాబాద్‌లో బీజేపీ నేతలంతా ఎదురు తిరుగుతుండడంతో అర్వింద్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి సైతం ప్రచారం ప్రారం భించలేదు. ఆయన అభ్యర్థిత్వంపై కొంత అసంతృప్తి నెల కొన్నదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.అటు జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ సైతం పార్టీశ్రేణులతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తుండడంపై సొంత పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు.