నిజామాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలే ఫలించాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి అధికారాన్ని అడ్డు పెట్టుకున్న అనుకున్నది సాధించింది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్పై పోలీసులతో బల ప్రయోగానికి గురి చేసింది. అడుగుడుగునా ప్రచారంలో ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలను సైతం తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేసింది. జూబ్లీహిల్స్ లోని అనేక బస్తీల్లో, గల్లీల్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తిష్ట వేసుకుని ఓట్లు వేయించుకున్నారు. ఇదంతా రాజ్యాంగ వ్యతిరేకం. స్థానికేతరులు పోలింగ్ రోజు ఉండటం తీవ్రమైన నేరం. అయినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరించింది. అధికార పార్టీకి ప్రభుత్వ యం త్రాంగం బహిరంగంగానే సహకారం అందించింది. నిబంధనలను ఉల్లంఘించిన కాంగ్రెస్ నేతలపై ఈగ వాలకుండా చూస్తూ ఉండిపోయింది. కాంగ్రెస్ నేతల దాష్టికాలపై ప్రశ్నిస్తే, ఆధారాలతో చూపిస్తే పోలీస్ స్టేషన్లకు తరలించి బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఇబ్బందులకు గురి చేసింది. ఇంతలా అధికార దుర్వినియోగం జరగడం మూలంగా సాంకేతికంగా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం నైతికంగా గెలిచి చూపించింది. అధికార కాంగ్రెస్‌కు చుక్కలు చూపించి వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలు ఖాయమనే సంకేతాలను అందించింది.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా గెలవడానికి ఓట్ల మెజార్టీ రావడానికి తెర వెనుక బీజేపీ ఉన్నదనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి పలు వార్తా ఛానళ్లలో కనిపించిన చర్చా వేదికల్లో ఈ అంశం తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న బీజేపీ పార్టీకి తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సిగ్గు చేటని పలువురు వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీకి లాభం చేయాలనే ఆలోచనలో భాగంగానే తూతూ మంత్రంగా ప్రచారం చేసినట్లుగా పలువురు అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటుగా బీజేపీ ఎంపీలు ఎవ్వరూ ఊహించిన స్థాయిలో జూబ్లిహిల్స్‌లో ప్రచారం చేపట్టలేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ కనిపిస్తారు. కాంగ్రెస్‌ను తిట్టినట్లుగా అప్పుడప్పుడు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కానీ నిజమైన యుద్ధ క్షేత్రంలో అర్వింద్ ఏ కారణంతో ప్రచారంలో వెనుకబడినట్లు? అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. అర్వింద్‌తో పాటుగా మిగిలిన ఎంపీలు ఎవ్వరూ బీజేపీ గెలవాలని ఆకాంక్షించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్‌ను గెలిపించడం కోసం బీజేపీ తీవ్రంగా కృషి చేసిందని చెబుతున్నారు. అందుకు వచ్చిన ఓట్ల శాతమే నిజమంటున్నారు. పదే పదే తెలంగాణలో బీజేపీ బలంగా ఉందంటూ ఊకదంపుడు ప్రసంగాలిచ్చే బీజేపీ నేతలంతా జూబ్లీహిల్స్ లో వచ్చిన ఓట్లతో ఏం సమాధానం ఇస్తారని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. 12 బూత్‌లకు ఇన్ఛార్జీగా నియమించిన చోట మాజీ మంత్రి సారథ్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బూత్ నెంబర్ 9 నుంచి 19 వరకు అన్నింట్లో బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించింది. దీనికి తోడుగా 23వ బూత్లోనూ గులాబీ పార్టీకి అత్యధిక ఓట్లు సాధించారు. ఈ 12 బూత్‌లలో భారత రాష్ట్ర సమితికి 1073 ఓట్ల మెజార్టీ వచ్చింది. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జీ ముత్యాల సునీల్ రెడ్డి బొక్కా బోర్లా పడ్డట్లు అయ్యింది. ఆయన ఇన్ఛార్జీగా ఉన్న నాలుగు బూత్‌లలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీయే రాలేదు. బూత్ నెంబర్ 31 నుంచి 34 వరకు అన్నింట్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి 278 ఓట్లు తక్కువగా వచ్చాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలోని బృందం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కష్టపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు సైతం నిర్వహించారు.