అవినీతి, అక్రమాలకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బోగస్ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయడంలో ఆరి తేరింది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా డాక్యుమెంట్లు సృష్టించి, స్థిరాస్తిపై హక్కులు ప్రసాదించడం ఈ శాఖకే చెల్లింది. కొందరు అధికారులు చట్టప్రకారం నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన పనులను అడ్డదారుల్లో చేస్తూ రిజిస్ట్రేషన్ శాఖకు చెడ్డపేరు తెస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న కొందరు సబ్రిజిస్ట్రార్లు పైసాయే పరమావధిగా పనిచేస్తూ కాసుల వేటలో మునిగితేలుతున్నారు. ఈ అక్రమార్జన తంతులో డాక్యుమెంట్ రైటర్లు కీలక పాత్ర పోషిస్తుండడం గమనార్హం.
భూ వ్యవహారాల్లో స్థానిక పోలీసుల సహాయ, సహకారాలను అక్రమార్కులు దక్కించుకుంటున్నారు. నకిలీ పత్రాలతో హడావుడి చేసే వ్యక్తులను ఎవరైనా ప్రశ్నిస్తే వారి నోరు మూయించేందుకు ఖాకీలు తెర మీదకు వస్తున్నారు. కాసుల ఆశ చూపడంతో పోలీసు లు సైతం మౌనంగా ఉంటూ, సహకారం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సబ్ రిజిస్ట్రార్లు చేస్తున్న అక్రమాల్లో రెవెన్యూ, పోలీస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు ఉద్యోగుల ప్రత్యక్ష పాత్ర ఉంటున్నది. వీరంతా కలిసి నిజామాబాద్ శివారులో భారీ గూడు పుఠానిని నడుపుతున్నారు. భూ దందాలో ఆరితేరి పోవడంతో ఈ ముఠాకు సామాన్యులు భయపడాల్సి వస్తున్నది.
నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకునే అక్రమార్కులకే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో పనులు సులువుగా పూర్తవుతున్నాయి. అసలైన పత్రాలతో వెళ్లే వారిని చెప్పులరిగేలా తిప్పించడం ఇక్కడ పరిపాటిగా మారింది. అడిగినన్నీ డబ్బులు ఇవ్వాలి, లేకుంటే కొర్రీలు పెట్టి వాయిదాలు వేయడం కూడా సబ్ రిజిస్ట్రార్లకు వెన్నతోపెట్టిన విద్య. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి సబ్ రిజిస్ట్రార్లు సహకరిస్తూ శాఖ పరువును బజారుకీడుస్తున్నారు. గతేడాది కాంగ్రెస్ పార్టీకి చెందిన భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలోనూ అక్రమార్కులకు వంతపాడిన విషయమే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి అక్రమాల్లో డాక్యుమెంట్ రైటర్లు కూడా కీలక భూమిక పోషిస్తున్నారు.
నిజామాబాద్ అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్లకు బైపాస్ రోడ్డులోని భూములు కాసుల వర్షం కురిస్తున్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభు త్వ, ప్రైవేటు భూముల మధ్య మిగులు భూమిని కబ్జాచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆధీనంలోని అసైన్డ్ భూములకు నాలా కన్వర్షన్ సులువు కావడంతో వాటికి కూడా ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేస్తూ భారీ మొత్తంలో దండుకుంటున్నారు. వక్రమార్గంలో నడిచే రిజిస్ట్రార్లను మచ్చిక చేసుకుని రియల్ వ్యాపారులు రూ.కోట్లు విలువ చేసే భూములకు బోగస్ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తుల పేరిట పేరు మార్పిడి చేయించుకుంటున్నారు. లేని నకిలీ రికార్డులను రూపొందించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నెలల వ్యవధిలోనే చేతులు మారినట్లుగా చూపించి అక్రమిత భూములను సక్రమం దిశగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంలో అధికార పార్టీలోని కీలక నేతల పాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఓ ఉద్యోగ సంఘానికి చెందిన కీలక నేత అండదండలతో ముఖ్యమైన భూముల సర్వే నంబర్లు, వాటి స్వరూపానికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుని, స్పష్టతలేని డాక్యుమెంట్లు ఉన్న స్థలాలను కొన్ని ముఠాలు అప్పనంగా కాజేస్తున్నాయి. ఇందులో ఎక్కువగా బైపాస్ రోడ్డు చుట్టు పక్క భూములే ఉండడం గమనార్హం. డబుల్ రిజిస్ట్రేషన్లతో అక్రమార్కులు చేస్తున్న దందాలో సామాన్యులు ఇరుక్కొని విలవిలలాడుతున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో గతేడాది ఓ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన భూమిని కూడా ఈ ముఠా వదల్లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శ్రమకోర్చి కొనుగోలు చేసిన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయడంతో సదరు నేత లబోదిబోమన్నాడు. చివరికి ఓ నాయకుడి సాయంతో ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించి సామాన్యులకు అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమార్కులతో అంటకాగుతున్న వారిలో అధికార పార్టీ నాయకులు కూడా ఉండడం విస్మయానికి గురిచేస్తున్నది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు, వారి కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది, అటెండర్లకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. ప్రవేశం లేని చోట ఇట్టే దూసుకు పోతారు. కీలకమైన పత్రాలను స్కాన్ చేసి, పేరు మార్పిడి చేసే కార్యాలయ ఆవరణలోకి స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఉద్యోగులు మినహా వేరే వారికి అనుమతి ఉండదు. ఒకవేల ప్రవేశిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కానీ నిజామాబాద్ అర్బన్, నిజామాబా ద్ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్, దోమకొండ, కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వారిదే హవా. సబ్ రిజిస్ట్రార్ టేబుళ్లపై స్వేచ్ఛగా నిలబడేంత హక్కు వారికే ఉందంటే అతిశయోక్తి కాదు. ఒక్క సంతకం మినహా మిగిలిన వ్యవహారాల్లో వీరే కీలక పాత్ర పోషిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ల సహాయం లేకుండా ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాదంటే నమ్మశక్యం కాదు. నేరుగా సామాన్యుడే స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న దాఖలాలు చాలా అరుదు. మధ్యవర్తులుగా వ్యవహరించే డాక్యుమెంట్ రైటర్లు ఎంత చెబితే అంతా. వారు ఏ డాక్యుమెంట్ ఇస్తే అదే సర్వం. అందులో ఏముంది. ఎలాంటి అంశాలు పొందు పర్చారు. అమ్మేవారు, కొనేవారు నిజమేనా? అన్న వాస్తవాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెక్ చేసుకోవడం అన్నది డొల్లగా మారింది. రెడ్‌హ్యాండెడ్‌గా రూ.10వేలు లం చం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు సబ్ రిజిస్ట్రార్ పట్టుబడడంతో ఇప్పుడు మరోసారి రిజిస్ట్రేషన్ శాఖ అవినీతి తంతుపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుండడం గమనార్హం.