భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. రోజురోజుకూ ప్రాభవం కోల్పోతున్న బీజేపీకి ఉమ్మడి జిల్లాలోనూ సంకట పరిస్థితి ఏర్పడింది. ఇందూరు బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయిన వేళ.. కాషాయ దళంలో కుమ్ములాటలు కామన్‌గా మారాయి. నోరు తెరిస్తే చాలు బూతులు, అబద్ధాలు వల్లెవేసే ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఇంటా, బయటా విమర్శల జడివాన కురుస్తున్నది. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌పేపర్ రాసిచ్చి రైతాంగం ముందు అభాసుపాలైన అర్వింద్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కొందరు నేతలు బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ తీరుతో ఇప్పటికే ప్రజల్లో తిరగలేక పోతున్న కమలం నేతలను అంతర్గత కుమ్ములాటలు మరింతగా కుంగదీస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కీచులాటలతో విసుగు చెందుతున్న అనేక మంది కమలాన్ని వదిలి కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.
– నిజామాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకరు కాదు… ఇద్దరు కాదు. వందలాది మంది నాయకులు ఇప్పుడు ఇందూరు బీజేపీలో అర్వింద్‌కు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌కు ఇంటా బయటా వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతున్నది. ఇప్పటికే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక రైతుల నుంచి ఆగ్రహావేశాలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా భారతీయ జనతా పార్టీలోనూ అర్వింద్ తీరుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ అర్వింద్ నాయకత్వంలో పని చేయలేమంటూ పలువురు కింది స్థాయి ప్రజా ప్రతినిధులు, నేతలంతా మూకుమ్మడిగా అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. నిన్న గాక మొన్న కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన అర్వింద్ చేతి కింద పని చేయడం ఏంటంటూ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలపై సరైన అవగాహన లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ కరుడు గట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు సైతం అర్వింద్ వైఖరిని తూర్పారబడుతున్నారు. ఓ వైపు రైతుల నుంచి వస్తున్న ముప్పును తప్పించుకోవడం కోసం రోజుకో విధంగా ఆటలాడుతుండగా.. ఇప్పుడు పార్టీలో నెలకొన్న సందిగ్ధత నుంచి తప్పించుకునేందుకు అర్వింద్ నెత్తి పట్టుకోవాల్సి వస్తున్నది.
మూడు గ్రూపులు…
భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నగర శాఖ ప్రస్తుతం ముచ్చటగా మూడు గ్రూపులుగా మారింది. ఇంతకు మునుపు అర్వింద్, యెండల లక్ష్మీనారాయణ మధ్య కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధం కాస్త అర్వింద్ వర్సెస్ యెండల వర్సెస్ బస్వా లక్ష్మీనర్సయ్య అన్నట్లుగా తయారైంది. బొటాబొటిన ఉన్న నాయకులతో నెట్టుకొస్తున్న బీజేపీలో ఇప్పుడు గ్రూపులు ఎక్కువయ్యాయి. ఇందులో కొత్తగా ఏర్పడిన గ్రూపులన్నీ అర్వింద్ వ్యవహారశైలికి వ్యతిరేకంగా ఏర్పాటవ్వడం చర్చనీయాంశం అవుతున్నది. మరోవైపు తక్కువ నాయకత్వం… ఎక్కువ గ్రూపులు అన్నట్లుగా మారిన భారతీయ జనతా పార్టీ ఇందూర్ శాఖ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆది నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. బస్వా లక్ష్మీనర్సయ్య, ధర్మపురి అర్వింద్ వివిధ పార్టీల నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నవారే. ఇతర పార్టీలో ఉన్న బస్వాను బీజేపీలోకి ధర్మపురి అర్వింద్ పట్టుకొచ్చి పార్టీ జిల్లా బాధ్యతలను అప్పగించారు. తీరా ఇప్పుడు ఆయనే ఎంపీకి వ్యతిరేకంగా మారి గ్రూపులు కట్టడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. బస్వా స్థానంలో ఎంపీ అర్వింద్ ఇప్పుడేకంగా పార్టీ పూర్వ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. ఈయనకు అధ్యక్ష కుర్చీని కట్టబెడతానంటూ హామీ ద్వారా తన వెంట తిప్పుకుంటున్నాడని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో నిన్నా మొన్నటి వరకు అర్వింద్ వెంట తిరిగిన వినయ్ రెడ్డి ఇప్పుడు ఎంపీకి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
అంతా ఏకపక్షం…
వెనుకొచ్చిన కొమ్ములు ముందా… ముందొచ్చిన చెవులు ముందా అంటే బీజేపీ ఇందూర్ శాఖలో వెనకొచ్చిన కొమ్ములే ముందు అన్నట్లుగా మారింది. ధర్మపురి అర్వింద్ తన తండ్రి శ్రీనివాస్ (డీఎస్)తో కలిసి కాంగ్రెస్ పార్టీలో కార్యకలాపాలను నిర్వహించిన నాటి నుంచి బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ప్రతిఘటిస్తూ వస్తున్నారు. డీఎస్ అవినీతి, అక్రమాలతో పాటు రాజకీయంగా ఎనలేని పోరాటం చేశాడు. తీరా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని తండ్రి వెంట హస్తం పార్టీ తరపున అనేక పర్యటనలు చేసిన అర్వింద్… ఒక్కసారిగా కాషాయ కండువాతో బీజేపీలో ప్రత్యక్షం అయ్యారు. 2019 సాధారణ ఎన్నికల ముందు హడావుడిగా బీజేపీలోకి వచ్చిన అర్వింద్ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. అనుకోకుండా ఎంపీగా గెలవడంతో పాత తరం నాయకులను కాదని ఏకపక్షంగా, దూకుడుగా వెళ్తూ అర్వింద్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం మూడున్నరేండ్లుగా కనిపిస్తున్నదే. డీఎస్ తనయుడిగానే ముద్ర వేసుకున్న అర్వింద్ తీరును నచ్చని బీజేపీ పాత నాయకులంతా ఒక్కటై సందర్భం చిక్కినప్పుడల్లా నేరుగా అర్వింద్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.
అర్వింద్ మాకొద్దు…
దేశం, రాష్ట్రంలో రోజురోజుకూ ప్రభావం కోల్పోతున్న భారతీయ జనతా పార్టీకి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సంకట పరిస్థితి దాపురించింది. ఎంపీ అర్వింద్ తీరుతో ఇప్పటికే ప్రజల్లో తిరగలేక పోతున్న కమలం నేతలకు అంతర్గత కుమ్ములాటలు మరింతగా కుంగ తీస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కీచులాటలతో విసుగు చెందుతున్న అనేక మంది కమలాన్ని వదిలి కారు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకొద్దీ అర్వింద్ అంటూ భారతీయ జనతా పార్టీకి బైబై చెబుతున్నారు. పసుపు బోర్డు హామీని నిలబెట్టుకోక పోవడంతో ప్రజల్లో బీజేపీ చులకనైందన్న భావనలో కొట్టుమిట్టాడుతున్నారు. నిజామాబాద్ కార్పొరేష న్లోని 28 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇందులో నుంచి ఎంపీ అర్వింద్‌పై విశ్వా సం కోల్పోయిన 11 మంది కార్పొరేటర్లు కమలం పార్టీని వీడి నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. అర్వింద్ తీరుతో విసుగు చెందుతున్న మిగిలిన కార్పొరేటర్లు సైతం నేడో రేపో గులాబీ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.
గిదేందన్న మన పార్టీలా పరిస్థితి గిట్ల తయారైంది. మనల్ని ఎవడూ పట్టించుకోడు. అర్వింద్‌కు చెబితే వినడు. ఆయన బూతులు వినడమే మన పనైపోయింది. హైదరాబాద్ వాళ్లకు ఎన్నిసార్లు చెప్పినా ఎంపీని మందలించకపోతే పార్టీ పరిస్థితి ఏం గావాలే. ఆయనకు(అర్వింద్‌కు) మన సిద్ధాంతాలు తెలుసా? మన ముఖాలైనా గుర్తు పడతడా. ఏండ్ల సంది పని చేస్తున్నోళ్లను కాదని ఎవడెవడికో పదవులిచ్చి లేపుతున్నడు. మనం బేకార్ గాళ్లలాగా కనిపిస్తున్నామా? ఇదేం మంచిగా లేదు. గిైట్లెతే మన పార్టీని ఇగ పూలాంగ్ వాగులో కలపడమే. ఇప్పటికే నిజామాబాద్లా పరిస్థితి బాలేదు. బీజేపీ పేరు చెబితే రైతులు కొట్టడానికి వస్తుండ్రు. ఎంపీ ఇక్కడికీ రాడు. మనం కలుస్తామంటే టైం ఇవ్వడు. ఇగ మనకు ఎందుకాయన. కనీసం ఫోనెత్తడు. మనకు కష్టమొస్తే ఎవడికి చెప్పుకోవాలె – అంటూ బీజేపీ ఇందూరు శాఖలో 30 ఏండ్లుగా జెండా పట్టుకుని పని చేస్తున్న ఓ నాయకుడి ఆగ్రహ రూపమిది.