సిరికొండ, సెప్టెంబర్ 9: వినాయక చవితి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉండడంతో ఇంటికి వచ్చిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని తాళ్ల తండాలో ఆదివారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నది. తండాకు చెందిన సంతోష్‌నాయక్ కుమారుడు సంజీవ్ (15) కామారెడ్డిలో చదువుకుంటున్నాడు.
వినాయకచవితి సందర్భంగా పాఠశాలకు సెలవు ఉండడంతో ఇంటికి వచ్చాడు. ఆదివారం రాత్రి వినాయక మండపం వద్ద సౌండ్‌బాక్స్ వైర్లు మార్చుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని కామారెడ్డి దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.