హైదరాబాద్, మార్చి 4 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ విధానాన్ని పూర్తిగా మార్చాలన్న మరో వివాదాస్పద నిర్ణయాన్ని తెలంగాణ విద్యాకమిషన్.. రాష్ట్ర సర్కార్ ముందుంచింది. ఆటోమెటిక్ ఉద్యోగోన్నతులు రద్దుచేయాలని తన నివేదికలో సిఫార్సు చేసింది. ప్రిన్సిపాళ్లను నేరుగా నోటిఫికేషన్ ద్వారానే నియమించాలని సూచించింది. యూజీసీ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని సూచించడమే కాకుండా.. డిగ్రీ కాలేజీల్లో ఉన్నత విద్యాప్రమాణాలను కొనసాగించేందుకు ఎలాంటి ఆటోమెటిక్ ప్రమోషన్లు కొనసాగించొద్దని సర్కార్‌కు సూచించింది. ఈ విధానం పరిపాలన, విద్యా అనుభవం, ఎక్కువ అర్హతలున్న, సమర్థులైన, దార్శనికులైన విద్యావేత్తల నియామకాన్ని ప్రోత్సహిస్తుందని కమిషన్ పేర్కొన్నది. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో 136 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 79 మంది పనిచేస్తున్నారు. ఇంకా 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను నేరుగానే నియమించాలని కమిషన్ సూచించడం వివాదాస్పదమవుతున్నది. కమిషన్ ఈ సిఫార్సుపై డిగ్రీ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. డిగ్రీ ప్రిన్సిపాళ్లను నేరుగా నియమించే విధానం దేశంలో మరెక్కడా లేదని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంగి రమేశ్, డిగ్రీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు బ్రిజేశ్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను నెలకొల్పవద్దని సర్కార్‌కు కమిషన్ సూచించింది. కొత్త కాలేజీలను మంజూరు చేయడం కన్నా ఉన్న కాలేజీలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నది. సరైన అధ్యయనం చేయకుండా, సాధ్యాసాధ్యాల నివేదిక లేకుండా కొత్త కాలేజీలను ప్రారంభిచొద్దని సిఫార్సు చేసింది. కొత్త కాలేజీలను ప్రారంభించడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు జనాభా డిమాండ్, ప్రోగ్రామ్స్ ఔచిత్యం, అధ్యాపకుల లభ్యత, మౌలిక వసతులు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుంటే ఎన్రోల్మెంట్పై ప్రభావం చూపుతుందని, అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లేమి వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో స్థానికులైన విద్యార్థులతోనే నింపాలని సర్కార్‌కు తెలంగాణ విద్యాకమిషన్ సూచించింది. జిల్లాను యూనిట్‌గా తీసుకొని ఆ జిల్లా పరిధిలోని విద్యార్థులతోనే సీట్లు భర్తీ చేసేలా మార్పులు చేయాలని సిఫార్సు చేసింది. ఇంటర్ తర్వాత విద్యార్థులు డిగ్రీ చదువుల కోసం హైదరాబాద్, వరంగల్ నగరాలకు ఎక్కువగా వలస పోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలి. ఒక్కో డిగ్రీ కాలేజీలో వెయ్యి మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు ఉండాలి. వంద మంది విద్యార్థులకు సరిపోయేలా హాస్టల్ నిర్మించాలి. కాలేజీల్లో అన్ని వసతులు కల్పించాక, అన్నిరకాల ప్రమాణాలు సమకూరాక ఆ కాలేజీల్లో సీట్లను సంబంధిత జిల్లా విద్యార్థులకే కేటాయించాలి. ఇతర జిల్లాల విద్యార్థులకు అసలే కేటాయించొద్దు అంటూ విధాన పత్రంలో పొందుపరిచింది. ఇదే జరిగితే నిజాం కాలేజీ, హైదరాబాద్ కోఠి మహిళా కాలేజీల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల విద్యార్థులకు ఇక నుంచి అసలే సీట్లు కేటాయించబోరన్న మాట. వాస్తవానికి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల తెలంగాణ (దోస్త్ )ను రద్దు చేయాలన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.