ముంబై, మార్చి 4 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ దారుణంగా పడిపోయింది. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద రూపీ వ్యాల్యూ సోమవారం క్లోజింగ్‌తో చూస్తే 56 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేనివిధంగా 92.05 దగ్గర ముగిసింది. ఒకానొక దశలోనైతే 92.35 స్థాయికి దిగజారి ఆల్‌టైమ్ ఇంట్రా-డే లో రికార్డు నెలకొల్పింది. నిజానికి ఫారెక్స్ మార్కెట్లో ఉదయం ఆరంభం నుంచే రూపాయి ఒత్తిడిని ఎదుర్కొన్నది. చివరిదాకా ఇదే ప్రెషర్ కనిపించింది. సోమవారం కూడా రూపాయి మారకం విలువ 49 పైసలు దిగజారిన విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి.
ఈ యుద్ధం కారణంగా ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తి, రవాణాలకు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్, ఎల్ఎన్జీ ధరలు విజృంభిస్తున్నాయి. సరిగ్గా ఈ పరిణామమే.. డాలర్లకు డిమాండ్‌ను పెంచుతున్నది. భారత్‌లోనూ దిగుమతిదారులు డాలర్లకు ఎగబడుతున్నారు. ఫలితంగానే రూపాయి మారకం విలువ బలహీనపడుతున్నదని ఫారెక్స్ ట్రేడర్లు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. అలాగే దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు, తరలిపోతున్న విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా రూపీపై ఒత్తిడిని పెంచుతున్నాయని అంటున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.8,752. 65 కోట్ల పెట్టుబడులను విదేశీ మదుపరులు వెనుకకు తీసుకున్నారు.