Akshaye Khanna | పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన ‘హనుమాన్’ చిత్రంతో ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU)కు శ్రీకారం చుట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఇప్పుడు మరో భారీ విజువల్ వండర్‌కు సిద్ధమయ్యారు. పీవీసీయూ నుంచి వస్తున్న తన తదుపరి భారీ చిత్రం ‘మహాకాళి’ (Mahakali) చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా వెల్లడించారు మేకర్స్. ‘ది ఎండ్ బిగిన్స్’ (THE END BEGINS) అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆగస్టు 24న ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు.
ఇక ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ సృష్టికర్తగా వ్యవహరిస్తుండగా, పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ దుగ్గల్ ఈ చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) కీలక పాత్రలో నటిస్తుండగా, భూమి శెట్టి ప్రధాన టైటిల్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు శ్రీయారెడ్డి, రోహిత్ సరాఫ్, ఖుష్బూ సుందర్, రాజేష్ బేడి, పోసాని మురళీ శర్మ, నాజర్, రజత్ కపూర్ వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
మైథలాజికల్ సూపర్‌హీరో జోనర్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేశ్ రఘు సినిమాటోగ్రఫీ అందించగా, శ్రీనాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హనుమాన్ సినిమాతో సూపర్‌హీరో కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ, ‘మహాకాళి’తో ఏ స్థాయి విజువల్ ట్రీట్ ఇస్తారోనని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.