ముంబై, మార్చి 4 : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల పరంపరలో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలోని యుద్ధ ప్రకంపనాలు మార్కెట్లో అలజడిని సృష్టిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దేశాలు సంయుక్తంగా దాడులు మరింత తీవ్రతరం చేయడంతో సూచీలు వరుసగా మూడోరోజు భారీగా పతనం చెందాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం కూడా పతనానికి ఆజ్యంపోశాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 1,795 పాయింట్లు లేదా 2.23 శాతం నష్టపోయి 78,443 పాయింట్లకు జారుకున్న 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 1,122.66 పాయింట్లు లేదా 1.40 శాతం నష్టపోయింది. చివరకు 79,116.19 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 385.20 పాయింట్లు లేదా 1.55 శాతం నష్టపోయి 24,480.50 వద్ద ముగిసింది. వరుసగా మూడు రోజులుగా తగ్గుముఖం పట్టడంతో ఇరు సూచీలు ఆరు నెలల కనిష్ఠ స్థాయిని తాకాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతోపాటు రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం, విదేశీ సంస్థాగత మదుపరుల విక్రయాలు సూచీల పతనాన్ని శాసించాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 3 శాతం ఎగబాకి 83.91 డాలర్లకు చేరుకున్నది.
క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో చమురు కంపెనీల షేర్లతోపాటు పెయింట్స్ షేర్లు కూడా భారీగా పతనం చెందాయి. హెచ్‌పీసీఎల్ షేరు 5.41 శాతం పతనం చెందగా, బీపీసీఎల్ షేరు 4.94 శాతం, ఐవోసీ షేరు 4.78 శాతం చొప్పున దిగువకు పడిపోయాయి. వీటితోపాటు శాలిమర్ పెయింట్స్ షేరు 2.60 శాతం, బర్గర్ పెయింట్ షేరు 2.22 శాతం, ఇండిగో పెయింట్స్ 1.49 శాతం, ఏషియన్ పెయింట్స్. కన్సాయి నెరోలాక్ పెయింట్స్, అక్జో నోబెల్ ఇండియా షేర్లు కూడా క్షీణించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుసగా రెండు రోజుల్లో వీరు రూ.16 లక్షల కోట్లకు పైగా సంపద కోల్పోయారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దేశాలు జరుపుతున్న యుద్ధంతో స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల పాలవుతున్నాయి. గత శుక్ర, సోమ, బుధవారాల్లో సెన్సెక్స్ 2,171 పాయింట్లు లేదా 2.67 శాతం నష్టపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.16,32,428.12 కోట్లు కరిగిపోయి రూ.4,47,18,243.15 కోట్లు లేదా 4.85 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. పశ్చిమాసియా దేశాల్లో రోజురోజుకూ యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురవుతున్నాయని, గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపరుల్లో సెంటిమెంట్‌ను నీరుగారుస్తున్నదని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. మరోవైపు, క్రూడాయిల్ ధరలు భగ్గుమంటుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం కూడా పతనానికి ఆజ్యంపోసిందన్నారు.