వినాయక్‌నగర్, మే 2: నిజామాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టారంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం రాత్రి డయల్ 100కు కాల్ చేసి సమాచారమిచ్చాడు. దీంతో హైదరాబాద్ డయల్ 100 కంట్రోల్ రూం నుంచి నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతికి సమాచారం అందించారు. ఎస్‌హెచ్‌వో .. సీపీ సాయి చైతన్యకు సమాచారం అందించగా.. హుటాహుటిన ఏఆర్ హెడ్ క్వార్టర్ నుంచి బాంబు, డాగ్ స్కాడ్ బృందాలతోపాటు ప్రత్యేక పోలీసు బలగాలతో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
నిజామాబాద్ జీఆర్పీ, సీఐ, ఎస్సై, సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్ల్లాట్‌ఫాం, పార్సిల్ గది, వెయిటింగ్హాల్తోపాటు బుకింగ్ కౌంటర్, రైల్వే ప్రాంగణంలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఎలాంటి బాంబు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు పెట్టారంటూ వచ్చిన ఫోన్‌కాల్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.